Cable stayed bridge to be launched on September 19

హైదరాబాద్‍కు మరో మణిహారం కానున్న దుర్గం చెరువు కేబుల్‍ సస్పెన్షన్‍ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయింది. వాహనాల రాకపోకలకు వీలుగా అందుబాటులోకి రానున్నది. ఈ కేబుల్‍ బిడ్జ్రి నిర్మాణం విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ బ్రిడ్జిని ఈ నెల 19న ప్రారంభించేందుకు హైదరాబాద్‍ మహానగర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి కేటీఆర్‍ ఈ వంతెను ప్రారంభించనున్నారు. ఐటీ ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండేలా ట్రాఫిక్‍ సమస్యలకు చెక్‍ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. మొత్తం రూ.184 కోట్లను దీని నిర్మాణానికి వ్యయం చేశారు. రెండు సంవత్సరాలలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయింది. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్‍ అండ్‍ టికి అప్పగించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిగా కేబుల్‍ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు.

దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్జి ఇదే. రోడ్‍ నంబర్‍ 45ను మాదాపూర్‍తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ సస్పెన్షన్‍ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు. ఆరు లేన్‍ల వెడల్పు ఉంటుంది. రెండు పిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు. జర్మనీ టెక్నాలజీతో 8 దేశాల ఇంజీనీర్లు 22 నెలల పాటు శ్రమించి దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.  దుర్గం చెరువు నీటి మట్టానికి 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మితమైంది. ఒక్కో పైలాన్‍కు 26 కేబుళ్లను వినియోగించారు. పాదచారులు, సైకిలిస్ట్ల కోసం ప్రత్యేకంగా ట్రాక్‍లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్‍ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్‍మంటోంది. కేబుల్‍ బ్రిడ్జికి రెండు వైపుల వాటర్‍ ఫౌంటేన్‍లు ఏర్పాటు చేయనున్నారు. జులై 20నే ఈ బ్రిడ్జిని ప్రారంభించవలసి ఉన్నా కరోనా నేపథ్యంలో ఆలస్యమైంది.