Kanaka Durga Temple amid reports of 3 missing silver lion statues

దేవుడు కూడా బిత్త‌ర‌పోతాడేమో.. దేవ‌త‌లూ చిత్త‌ర‌వువుతారేమో... అన్న‌ట్టుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఆల‌యాల చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్నాయి. ఏపీలో కొత్త ప్ర‌భుత్వం రాక త‌ర్వాత ఊపందుకున్న‌ ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తులుగా ఎద‌గాల‌నుకుంటున్న పార్టీలు త‌మ త‌మ స్థాయిలో ఊత‌మిస్తున్నాయి.  రాష్ట్రంలో ఒక‌దాని వెంట ఒక‌టిగా చోటు చేసుకుంటున్న సంఘ‌ట‌న‌లు ఏపీ రాజ‌కీయాల్ని మ‌త‌ప‌ర‌మైన మ‌లుపులు తిప్పేందుకు త‌మ‌వంతుగా కార‌ణ‌మ‌వుతున్నాయి. 

కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత  రాష్ట్ర సిఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆచారాల్ని పాటించ‌ లేదనే ఆరోప‌ణ‌ల‌తో మొద‌లైన వివాదాగ్నికి తాజాగా విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో ర‌ధానికి ఉన్న వెండి ప్ర‌తిమ‌ల చోరీ వ‌ర‌కూ వ‌రుస‌గా ఆజ్యం పోసే సంఘ‌ట‌న‌లెన్నో. కొన్ని రోజుల క్రితం తూర్పుగోదావ‌రి జిల్లాలోని పేరొందిన‌ అంత‌ర్వేది ఆల‌యంలో రధం ద‌గ్ఘం సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై రాజ‌కీయ పార్టీలు, ఆధ్యాత్మిక వేత్త‌లు సైతం గొంతు విప్పారు. తేదేపా ఓ వైపు భాజాపా, జ‌న‌సేన వంటి పార్టీలు మ‌రోవైపు నిర‌స‌న‌ల‌నూ హోరెత్తించాయి. విచార‌ణ అధికారిని నియ‌మించినా, ద‌ర్యాప్తు వేగంగా పూర్తి చేస్తామ‌ని చెప్పినా.. గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. దీంతో స‌మ‌స్య ముద‌ర‌బోతోంద‌ని గుర్తించిన ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌పై  సిబిఐ విచార‌ణ కోరుతూ లేఖ రాసింది. 

దాంతో రధం ద‌గ్థం ఘ‌ట‌న‌కు కార‌కులెవ‌ర‌నేది తేల‌క‌పోయినా, విప‌క్షాలు పెద్ద‌గా నోరు చేసుకునే అవ‌కాశం లేకుండా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగానులే హ‌మ్మ‌య్య అంటూ ఊపిరిపీల్చుకుంది ప్ర‌భుత్వం. అంతలోనే దుర్గ‌గుడిలో వెండి సింహాల చోరీ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గుడిలో ర‌ధానికి కున్న వెండి సింహ‌పు ప్ర‌తిమ‌లు చోరీ జ‌రిగాయ‌ని రెండు రోజుల నుంచి వ‌స్తున్న వార్త‌ల‌ను గురువారం ఆల‌య వ‌ర్గాలు నిర్ధారించాయి. రూ.20ల‌క్ష‌ల విలువ చేసే ప్ర‌తిమ‌ల‌ చోరీ నిజ‌మేన‌ని అంగీక‌రించాయి. దీనిపై అధికారికంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి.  ఇప్ప‌టికే దీనిపై తేదేపా నేత‌ బుద్దా వెంక‌న్న‌, భాజాపా పేత సోము వీర్రాజులు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. చోరీ నిజ‌మేన‌ని గురువారం నిర్ధార‌ణ కావ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన ప్ర‌భుత్వం ఎదురుదాడికి దిగింది. గ‌త తేదేపా హ‌యంలో ఆల‌యాల్లో క్షుద్ర‌పూజ‌లు జ‌రిగాయంటూ  ఆల‌య క‌మిటీ చైర్మ‌న్ సోమినాయుడు విమ‌ర్శ‌ల‌కు దిగారు. సాక్షాత్తూ చంద్ర‌బాబు స‌తీమ‌ణి క‌నుస‌న్న‌ల్లోనే క్షుద్ర‌పూజ‌లు జ‌రిగాయ‌న్నారు. ఈ అంశంపై మ‌రింత‌గా విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు త‌ప్ప‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌ప‌డ‌డానికి మ‌త‌ప‌ర‌మైన అంశాలు లేవ‌నెత్త‌డ‌మే స‌రైన‌ద‌ని విప‌క్షాల్లోని కొన్ని శ‌క్తులు భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి ఈ విష‌యంలో గ‌తంలో తేదేపాపై కూడా వైకాపా ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌లు చేసింది. తిరుమ‌ల లోని పింక్ డైమండ్‌, ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితుల వ్య‌వ‌హారం, ఆల‌యాల్లో క్షుద్ర‌పూజ‌లు, గోశాల‌, గుళ్లు తొల‌గింపు... వంటివాటిపై ఆ పార్టీ కూడా చేయ‌గ‌లిగినంత ర‌చ్చ చేసింద‌నే చెప్పాలి. అయితే అప్పుడు ప‌లు అస్త్రాల్లో అదొక‌టి కాగా... ఇప్పుడ‌లాంటి అంశాలే విప‌క్షాలు ప్ర‌ధాన అస్త్రంగా మ‌ల‌చుకున్న‌ట్టు కనిపిస్తోంది. ఈ నేప‌ధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రిన్ని ఆల‌యాల్లో నాయ‌క దేవుళ్లు తిష్ట‌వేసి వాటిని రాజ‌కీయ వేదిక‌లుగా మార్చ‌డం త‌ప్ప‌క‌పోవ‌చ్చున‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.