Talasani Srinivas Yadav Went to Bhatti Vikramarka House

ప్రభుత్వం ప్రతిపక్షం ఎప్పుడూ తలపడుతూనే ఉంటాయి. పరస్పర ఆరోపణలతో మీడియా తలుపు తడుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు వీటిలో మరో అడుగు ముందుకు పడుతుంది. దమ్ముంటే నిరూపించు అంటే నిరూపిస్తా దా అంటూ బలమైన సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటుంటాయి. అయితే అంతకు మించి ఒక్క అంగుళం కూడా కదలడం అరుదే. 

ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటì  తతలంగాలు ఎక్కువ చూస్తుంటాం. చాలా వరకూ అసెంబ్లీలో ప్రత్యక్షప్రసారాలను దృష్టిలో ఉంచుకుని హంగామా చేయడానికి మాత్రమే పరిమితమయ్యే ఈ తరహా సవాళ్లు–ప్రతిసవాళ్ల పర్వాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కొత్త పుంతలు తొక్కించారు. విపక్షం విసిరిన   సవాల్‌పై వెనుకడుగేయకుండా అసెంబ్లీ అయిపోయాక కూడా దాన్ని గుర్తుంచుకున్నారు. ఈ ఉదంతం పూర్వాపరాలకు వెళితే...

ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా బుదవారం తెరాస హామీ ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా  డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల గురించి ప్రతి గ్రేటర్‌ ఎన్నికల ముందూ ప్రభుత్వం కాకమ్మ కధలు చెబుతోందని, లక్ష ఇళ్లు అంటూ దొంగ లెక్కలు చెబుతోందని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. దీనికి స్పందించిన మంత్రి తలసాని... డబుల్‌ నిర్మాణాలు కళ్ల ముందు కనిపిస్తున్నా విపక్షాలు చూడకుండా మాట్లాడుతున్నాయంటూ ప్రతిదాడి చేశారు. విపక్షాలకు బుధ్ధి లేదంటూ విమర్శించారు. ఈ సందర్భంగా భట్టి–తలసాని మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నిర్మాణంలో ఉన్న డబుల్‌ ఇళ్లను స్వయంగా వచ్చి తాను చూపిస్తానని భట్టి సరేనంటే  తమ చిత్తశుధ్ది నిరూపిస్తానని తలసాని సవాల్‌ చేశారు. దీనికి భట్టి కూడా సై అన్నారు. 

అన్నట్టుగానే  తలసాని గురువారం  ఉదయం 10గంటల కల్లా భట్టి నివాసానికి చేరుకున్నారు. తమ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వివరాలను తలసానికి అందించారు. అంతేకాకుండా తనతో పాటు కలిసి వచ్చి ఆ ఇళ్ల నిర్మాణం చూడండి అంటూ భట్టిని ఆహ్వానించారు. దీనికి భట్టి కూడా అంగీకరించి సదరు డబుల్‌ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాతవారికే ఇళ్లు ఇచ్చారంటూ భట్టి ఆరోపించారు. అయితే అందరూ పాతవాళ్లు కాదని కొత్త వారు కూడా ఉన్నారని తలసాని సమాధానమిచ్చారు. అనంతరం వీరిద్దరూ విలేకరులతో మాట్లాడారు.  మొత్తం 3,248 ఇళ్లను పరిశీలించామంటూ భట్టి చెప్పారు. మరుసటి రోజూ ఇళ్ల పరిశీలన కొనసాగుతుందని భట్టి చెప్పగా,. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఆలస్యం అయినా నాణ్యమైన ఇళ్లు కట్టివ్వాలనే ఆశయంతో తామున్నామని  తలసాని స్పష్టం చేశారు.

ఇందులో ఎవరు కరెక్ట్‌ అనేది పక్కన బెడితే... ఒక మంచి సంప్రదాయానికి మంత్రి తలసాని నాంది పలికారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షాలు కాబట్టి ఏదో ఒకటి విమర్శిస్తాయంటూ వదిలేయకుండా ప్రశ్నలకు సమాధానంగా తాము చేసిన పనుల్ని స్వయంగా విపక్ష నేతను తోడ్కొని వెళ్లి మరీ దగ్గరుండి చూపించడం ద్వారా ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేశారని అంటున్నారు. ఈ తరహా రాజకీయాల వల్ల అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.