Ex CM Chandrababu Naidu Press Meet

అందరినీ సమానంగా గౌరవించే సంస్కృతి పాలకులకు ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చాక ఆలయాల దాడులకు సంబంధించి 80 ఘటనలు జరిగాయని, ఇన్ని ఘటనలు జరిగితే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. మత సామరస్య కాపాడటం ప్రభుత్వం బాధ్యత కాదా? అని నిలదీశారు. ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామనే ధోరణి సరికాదు. శ్రీవారి దర్శనానికి వచ్చిన అబ్దుల్‍ కలాం, సోనియాగాంధీ డిక్లరేషన్‍లో సంతకం చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్‍ ఏనాడు డిక్లరేషన్‍లో సంతకం చేయలేదు. ఎవరు మాట్లాడినా ఎదురుదాడి చేసే పరిస్థితి ఉంది. ఇవాళ ఆలయాలపై దాడులు చేసిన వాళ్లు రేపు మసీదులు, చర్చిలపై దాడులు చేస్తారు. మొదట ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన ఉంటే ఇలాంటివి మళ్లీ పునరావృతం అయ్యేవి కాదన్నారు.

తెలుగుదేశం హయాంలో అన్ని మతాలను సమానంగా గౌరవించాం. అయోధ్య భూమి పూజా కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో లైవ్‍ ఇవ్వకపోవడం పాటు టీటీడీ డైరీలు తగ్గించేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో వెండిరథానికి ఉన్న సింహం ప్రతిమలు మాయ్యమయ్యాయి. ఈ విషయం వెలుగులోకి వస్తే ఇప్పటి వరకు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విజయవాడలోనే ఉన్న దేవాదాయశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎన్ని ఘటనలు జరిగినా ప్రభుత్వంలో మార్పు లేదు. జాగ్రత్తలు లేవు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఇష్టానుసారం చేయడం పోలీసులకు తగదు అని చంద్రబాబు హెచ్చరించారు.