bathukamma-festivities-to-begin-from-oct-16

ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్‍ 16 నుంచి 24 వరకు జరుపుకోవాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. అధిక ఆశ్వయుజ మాసం కారణంగా బతుకమ్మ పండగ తేదీలపై ఉన్న అసృష్టతను తొలగించేందుకు ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష్య పండితులతో కూడిన తెలంగాణ విద్వత్సభ ప్రతినిధులతో కవిత హైదరాబాద్‍లోని తన నివాసంలో చర్చించారు. అధిక మాసాన్ని పరిగణనలోకి తీసుకొని, ప్రతి సంవత్సరంలాగే భాద్రపద మాసంలో కాకుండా ఆశ్వయుజ మాసంలో అక్టోబర్‍ 16న బతుకమ్మను ప్రారంభించి 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవాలని పండితులు సూచించినట్టు కవిత తెలిపారు. ప్రతి 19 ఏండ్లకోసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని, శాస్త్రం ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేదపండితులు తెలిపారని ఆమె పేర్కొన్నారు.

పండితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్‍ 16న బతుకమ్మ ప్రారంభించాలని ఆడపడుచులను కవిత కోరారు. తెలంగాణ జాగృతి చాలా ఏండ్ల నుంచి బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నందున, చాలామంది పండుగ తేదీలపై తనను సంప్రదించారని కవిత పేర్కొన్నారు. ఈ చర్చలో విద్వత్సభ రాష్ట్ర అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహనశర్మ తదితరులు పాల్గొన్నారు.