Nagarjuna To Play YS Jagan in Yatra 2

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా చాలామంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు బ‌యోపిక్‌ల‌పై ప‌డ్డారు. నిజ జీవిత క‌థ‌ల‌కు ప్రేక్ష‌కుల్లో ఆద‌ర‌ణ బాగా ఉంటుంద‌ని గ్ర‌హించిన ద‌ర్శ‌కులు ఆ త‌ర‌హా క‌థ‌ల‌తో సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు భాష‌ల్లో చాలా బ‌యోపిక్స్ వ‌చ్చాయి. వాటిలో కొన్ని ఘ‌న‌విజ‌యం సాధిస్తే.. మ‌రికొన్ని డిజాస్ట‌ర్ అయ్యాయి. 2019 ఎల‌క్ష‌న్స్ ముందు `యాత్ర‌` పేరుతో దివంగ‌త ముఖ్య‌మంత్రి డా.వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవిత క‌థ‌ను తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ మ‌హి వి.రాఘ‌వ‌. వై.ఎస్‌. పాద‌యాత్ర నేప‌థ్యంలో తీసిన ఈ సినిమా జ‌గ‌న్ పార్టీ విజ‌యానికి ఎంతో తోడ్ప‌డింద‌ని చెప్పుకుంటారు. వైయస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అంద‌ర్నీ మెప్పించారు. ఇప్ప‌డు ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో డైరెక్ట‌ర్ మ‌హి వి.రాఘ‌వ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

`యాత్ర‌2` పేరుతో ఈ సీక్వెల్‌ను తెర‌కె్కించాల‌ని మ‌హి ఆలోచిస్తున్నాడ‌ని స‌మాచారం. వై.ఎస్‌.ఆర్‌గా నాగార్జున న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వై.ఎస్‌.ఆర్, జ‌గ‌న్ చుట్టూ న‌డిచేలా ఓ ఆస‌క్తిక‌ర‌మైన కాన్సెప్ట్‌ని మ‌హి సిద్ధం చేసాడ‌ని స‌మాచారం.  జ‌గ‌న్ పాత్ర‌ను ఓ యంగ్ హీరో పోషించే అవ‌కాశం ఉంది. నాగార్జున‌కు వై.ఎస్‌. ఆర్‌. అంటే ఎంతో అభిమాన‌మ‌ని అంద‌రికీ తెలుసు. అలాగే వై.ఎస్‌.జ‌గ‌న్.. నాగార్జున మ‌ధ్య ఉన్న స్నేహం కూడా తెలిసిందే. అందుకే ఈ సినిమాను నాగార్జున చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. స్క్రిప్ట్ ప‌క్కాగా ఓకే అయిపోతే జ‌గ‌న్ క్యారెక్ట‌ర్‌ను కూడా నాగార్జునే పోషించే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ట‌. నాగార్జున రెండు క్యారెక్ట‌ర్లు చేసే విష‌యం గురించి మ‌హితో ఇప్ప‌టివ‌ర‌కు చ‌ర్చించ‌లేద‌ట‌. డైరెక్ట‌ర్ కూడా దీనికి ఓకే అంటే నాగార్జున డూయ‌ల్ రోల్‌లో `యాత్ర‌2` ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌నా చెయ్య‌లేదు. సినీవ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు ఈ సీక్వెల్ ఎలా ఉండ‌బోతోంద‌నేది సూచ‌న‌ప్రాయంగా బ‌య‌టికి వ‌చ్చింది.