హిందూ దేవాలయాలలో ప్రభుత్వ జోక్యం అవసరమా?

The Temples Protection Movement

రాష్ట్రపతికి టెంపుల్‍ ప్రొటెక్షన్‍ మూవ్‍మెంట్‍ - ప్రముఖుల వినతి

కొన్ని సంవత్సరాలుగా మన దేశం లో కొన్ని దేవాలయాలు , కొందరు  హిందూ హేతువాదులు దేవాలయాల నిర్వహణ లో ప్రభుత్వ జోక్యం ఎంత వరకు  అని ప్రశ్నించటం, కొందరు వినతి పత్రాలు సమర్పించటం, మరి కొందరు న్యాయ పరంగా కోర్ట్ లలో రక్షణ కోరటం చాలా మందికి  తెలిసిన విషయమే. అయితే క్రిందటి నెలలో కేరళ లోని ట్రావెంకొర్‍ లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం విషయం లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు  ఈ వాదన కు మళ్ళి  ఊపిరి పోసిందని చెప్పాలి.  ఈ నెల ఆగష్టు 5 వ తేదీన భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అయోధ్య లో శ్రీ రామ మందిర నిర్మాణానికి శంఖు స్థాపన కార్యక్రమం   జరిపి యావత్ప్రపంచానికి భారత దేశం రాజ్యాంగ పరంగా లౌకిక (సెక్యూలర్‍) దేశం అయినా,  సిద్ధాంతపరంగా హిందూ దేశం అని ఒక సందేశాన్ని ఇచ్చారని అనేకమంది పెద్దలు, విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. 

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం విషయంలో ...

తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి విషయమై ఇటీవల సుప్రీంకోర్టు ఓ తీర్పును వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్‍కోర్‍ రాజకుటుంబానికి చెందుతాయని స్పష్టం చేసింది. దాదాపు 9 ఏళ్ళుగా కొనసాగిన వివాదాలకు ముగింపు పలుకుతూ జూలై 13వ తేదీన ఈ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పులోని కొన్ని ముఖ్యమైన అంశాలు...

ట్రావెన్కోర్‍ రాజ్యానికి మహారాజు శ్రీ పద్మనాభస్వామే. ఆ భగవంతుని దాసులుగా ట్రావెన్కోర్‍ రాజవంశీయులు రాజ్యాన్ని పాలిస్తుండేవారు. 1750వ సంవత్సరంలో జనవరి 20వ తేదీన త్రిప్పతి దానం పేరుతో ట్రావెన్కోర్‍ రాజ్యాన్ని శ్రీ పద్మనాభస్వామికి దానమిచ్చారు. దానితరువాత రాజ్యానికి రాజు పద్మనాభస్వామే. ఆయన దాసునిగా ట్రావెన్సోర్‍  రాజవంశీయులు రాజ్యపాలన చేశారు. 1947లో సవరించిన భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సెక్షన్‍ 6(4)  ప్రకారం దేశంలో ఉన్న రాజ్యాలు, సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమయ్యాయి. ఆ సమయంలో వారికి ఉన్న అన్నీ హక్కులు, బాధ్యతలు  కాపాడబడుతాయని పేర్కొంటు రాజ్యాంగంలో పొందుపరిచారు. చట్టం ప్రకారం భగవంతుడు మైనారిటీ కాబట్టి, భగవంతుని తరపున దాసులు అధికారపూర్వకంగా విలీవ సమయంలో సంతకాలను చేశారు. ట్రావెన్కోర్‍ రాజ్యాంగం 1123 ప్రకారం సెక్షన్‍ 4బి కింద పద్మనాభస్వామినే రాజుగా గుర్తించడంతోపాటు హిందూ ఆలయ పాలనా వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ప్రభుత్వానికి లేదు.  ప్రైవీపర్స్ జడ్జిమెంట్‍ ప్రకారం రాజ్యపాలకులంతా ఈ దేశ పౌరులుగా వ్యవహరింపబడుతారు. అందులో భాగంగా ట్రావెన్కోర్‍ రాజుగా ఉన్న పద్మనాభస్వామి కూడా ఈ దేశ పౌరుడే. ఆయనకు ఉన్న సహజ హక్కులకు భంగం కలగజేసే అధికారం ఎవరికీ లేదు.

కొన్ని ఇతర దేవాలయాల పరిస్థితి.. 

దేశంలో 621 శతాబ్దాలనాటి మఠంగా గుర్తింపు పొందిన అతి ప్రాచీనమఠమైన అహోబిలమఠానికి విజయనగర రాజులు, కళింగరాజులు శిష్యులుగా ఉన్నారు. అహోబిలమఠం పీఠాధిపతులు తొలినుంచి ధర్మసంరక్షణకు కట్టుబడి ఆలయాల రక్షణలో ముందుంటున్నారు. ముస్లింల దండయాత్ర వలన నాశనమైన అహోబిలంలోని శ్రీ న•సింహ ఆలయాన్ని పునరుద్ధరించారు. అలాగే తమిళనాడులోని ఆళ్వార్‍ తిరునగరిలో నమ్మాళ్వార్‍ విగ్రహాన్ని పునప్రతిష్ఠించారు. పూరీ జగన్నాథ స్వామి ఆలయాన్ని కూడా పరిరక్షించారు. ప్రస్తుత పీఠాధిపతులు శ్రీవణ్‍ శఠకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‍  స్వామివారు కూడా దీనికి మద్దతును ఇస్తూ, ఆలయ వ్యవహారాల్లో ప్రభుత్వ పెత్తనం ఉండరాదని సూచిస్తున్నారు. కంచిపరమాచార్య ఇలా ఎందరో మహానుభావులంతా ఆలయ సంప్రదాయాలకు, హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరుకున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో శబరిమల వ్యవహారంలో సెప్టెంబర్‍ 28న ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ప్రకారం ఆలయ స్వయంప్రతిపత్తికి ఇచ్చిన హక్కులకు భంగం కలిగిస్తోంది. ఈ తీర్పు ఆలయంలోని భగవతామూర్తులకు ఏ విధమైన రాజ్యాంగ హక్కులు లేవని పేర్కొంటోంది. అనాదిగా వస్తున్న సంస్కృతీ, సంప్రదాయాలకు, రాజ్యాంగ హక్కులకు భంగాన్ని కలిగిస్తోంది. ధర్మేణ హన్యతే వ్యాధిః హన్యంతే వై తథా గ్రహాః ధర్మేణ హన్యతే శత్రుః యతో ధర్మస్తతో జయః అని మహాభారతంలో చెప్పినట్లుగా, ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎలాంటి కష్టాలు, రోగాలు రావు.  దేశంలో కోవిడ్‍? 19 వైరస్‍? కేసుల పెరుగుదల, చైనా వ్యవహారం, నేపాల్‍ సరిహద్దు వివాదం వంటి ఇబ్బందులు మనం ధర్మంగా వ్యవహరిస్తే తలెత్తవని మన ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి.

చిలుకూరు బాలాజీ టెంపుల్‍ అనుసరించే విధానం :

హైదరాబాద్‍ నగరం వెలుపల, రంగారెడ్డి జిల్లాలో చిలుకూరు గ్రామంలో వుండే చిలుకూరు బాలాజీ గుడి కూడా చాలా పురాతనమైనది. ఇది 14 వ శతాబ్దంలో అక్కన్న, మాదన్నల కాలంలో కట్టిన గుడి గా చెపుతారు.  భక్తి పరంగా చెప్పాలంటే ... ఈ గుడి లోని శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి  తమ కోరికలు చెప్పుకొని, ఆ కోరికలు తీరాకా మళ్ళి  వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తూ వుంటారు. అమెరికా వీసా కోసం వెళ్లే వారు ఈ గుడికి వచ్చి వెళతారని, ఈ దేముణ్ణి వీసా వెంకటేశ్వర స్వామి అని అంతా అంటారు. అలాగే సిద్ధాంత పరంగా చెప్పాలంటే ఈ గుడి కూడా అనేక దశాబ్దాలుగా ప్రభుత్వ పరంగా వచ్చే నియంత్రణలు అనవసరం అని పోరాడుతోంది. దేశంలోనే ప్రభుత్వ నియంత్రణ లో లేని గుళ్ళలో చిలుకూరు బాలాజీ గుడి ఒకటి. ఈ గుడి ప్రధానపూజారి శ్రీ సౌందర్‍ రాజన్‍. ‘ ప్రతి గుడి తన దగ్గరకు వచ్చే భక్తులలో భక్తి ని పెంచాలి గాని, గుడి ఆదాయాన్ని కాదు ‘ అని అంటూ ఉంటారు. ఈ గుడి లో దేముడికి కానుకలు సమర్పించే హుండీ ఉండదు. పూజలు/ సేవలు చేసుకొనటానికి టికెట్‍ ఉండదు.  2001 లో శ్రీ సౌందర్‍  రాజన్‍  మరియు ఇతరులు చేసిన నిరసనలు, పోరాటాల ఫలితమే అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్‍ యాక్ట్ లో కొన్ని సవరణలు జరిగాయి. అప్పటి రోజులలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‍ ఆఫీసర్‍ గా వున్నశ్రీ పి వి ఆర్‍ కె ప్రసాద్‍ గారు చిలుకూరు బాలాజీ గుడి అనుసరించే హుండీ లేని, ఆర్జిత సేవలు లేని విధానం బావుందని మెచ్చుకొన్నారు

టెంపుల్‍ ప్రొటెక్షన్‍ మూవ్‍ మెంట్‍ ఎం చెపుతోంది?

హిందూ సంస్కృతికి, హిందువుల ఆలయాలకు వ్యతిరేకంగా ఇన్నాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ,మరోవైపు రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం నడుచుకోకుండా దానికి విరుద్ధంగా  ప్రభుత్వాలు చేస్తున్న అనవసర జోక్యాన్ని నిరసిస్తూ పవిత్రమైన భారతదేశంలో రామరాజ్యస్థాపనకు అందరూ కట్టుబడి ఉండాలని కేందప్రభుత్వం, ఇతర రాజ్యాంగవ్యవస్థలకు సూచనలు, సలహాలను ఇవ్వాల్సిందిగా టెంపుల్స్ ప్రొటెక్షన్‍ మూవ్‍మెంట్‍ పలువురు ప్రముఖులతో కలిసి జులై 18 వ తేదీన  రాష్ట్రపతి శ్రీ రామ్‍నాథ్‍ కోవింద్‍ కు ఒక వినతి పత్రం సమర్పించింది.  అందులో రాజ్యాంగం పేర్కొన్న వివరాలను, ఇటీవల సుప్రీంకోర్టు అనంత పద్మనాభ స్వామి వ్యవహారంలో ఇచ్చిన తీర్పును ఉదహరించింది. శబరిమల దేవాలయంలోనే కాకుండా, ఇతర దేవాలయ వ్యవహారాల్లో కూడా ఇలాంటి తీర్పునే తాము కోరుకుంటున్నామని కూడా తెలియజేసింది. దేశ ప్రథమ పౌరుడిగా ఆయనకు ఉన్న అధికారాలను ఇందుకు వినియోగించాలని కోరింది. 

టెంపుల్‍ ప్రొటెక్షన్‍ మూవ్‍మెంట్‍ కోరుతున్నదేమిటంటే.....

సుప్రీంకోర్టులో రానున్న శబరిమల రివ్యూ పిటీషన్‍ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరపున హాజరయ్యే అటార్నీ జనరల్‍కు ఆర్టికల్‍ 26 ప్రకారం హిందూ దేవతలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సుప్రీంకోర్డుకు కేంద్రం తెలియజేయాలి.

ముఖ్యమైన పండుగల సమయంలో, ఇతర వేడుకల సమయంలో అనంత పద్మనాభస్వామికి గౌరవవందనంగా ఆర్మీ చేసే   21 గన్‍సెల్యూట్‍ను మళ్ళీ కొనసాగించాలి.

అనంత పద్మనాభస్వామికి ఉన్న విలువైన సంపదను పరిరక్షించే బాధ్యతను ఇండియన్‍ ఆర్మీకి ఇవ్వాలి. గతంలో ట్రావెన్కోర్‍ రాజ్యపాలనలో ట్రావెన్కోర్‍ నాయర్‍ బ్రిగేడ్‍ దళం ఆలయ ఆస్తులను పరరక్షించేది. అది ఇప్పుడు ఇండియన్‍ ఆర్మీలో విలీనమైంది. డచ్‍ నేవీతో జరిగిన యుద్ధంలో పద్మనాభస్వామి అనుగ్రహం వల్లనే తాము విజయాన్ని సాధించామని ఇప్పటికీ ఆర్మీకోలాచల్‍ డేను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ట్రావెన్సోర్‍ కొచ్చిన్‍ హిందూ రిలీజియస్‍ ఇన్‍స్టిట్యూషన్‍ యాక్ట్ 1974లో చేసిన సవరణను రద్దు చేసేందుకు కేందప్రభుత్వం తన అధికారాలను వినియోగించాలి. ఈ యాక్ట్ ద్వారా పద్మనాభస్వామి పాలకుడు అన్న చట్టాన్ని రద్దు చేసి, కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్‍ దేవస్వామ్‍ బోర్డ్ ఏర్పాటు చేసింది.  రాజకీయపరమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలి.

హైందవ దేవాలయాల్లో ప్రభుత్వ జోక్యంపై స్వామి దయానంద సరస్వతి వేసిన కేసులో కేంద్ర ప్రభుత్వం తన అటార్నీ జనరల్‍ ద్వారా హిందూ దేవతలకు ఉన్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, దేశ క్షేమాన్ని, సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి.

పలువురు ప్రముఖుల మద్దతు

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‍ కృష్ణారావు మాట్లాడుతూ, హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా జరిగిన అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణ భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని మన దేశ ధార్మిక ఔన్నత్యానికి ప్రతీకగా రామమందిర నిర్మాణం జరుగుతోందని చెప్పారు. కాని రాజ్యాంగం కల్పించిన హక్కులను  హిందూ దేవతలకు కల్పించకపోతే అయోధ్య రాముడు కూడా హక్కులులేని రాముడిగా మిగిలిపోతారు. శబరిమల రివ్యూ కేసులో కేంద్ర ప్రభుత్వం తన అటార్నీ జనరల్‍ ద్వారా ఇప్పటికైనా హిందు దేవతలకు ఉన్న హక్కులను గుర్తించేలా చూడాలని సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయంలో చిల్కూరు అర్చకులు శ్రీ సౌందర్‍రాజన్‍ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఆంధప్రదేశ్‍లోని ఆలయ ధర్మకర్తల మండలి సంఘం అధ్యక్షుడు ఎస్‍.వి సుధాకర్‍రావు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ ఎస్‍సి రిజర్వేషన్‍ పరిరక్షణ సమతి జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం మాట్లాడుతూ, దేవాలయాల్లో వెనుకబడినవర్గాలకు, ఇతరులకు ప్రవేశాన్ని కల్పించింది అనంత పద్మనాభస్వామి మాత్రమే అని, అలాంటి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇలా పలువురు ప్రముఖులు ఈ పోరాటానికి తమ మద్దతును ప్రకటించారు.

చెన్నూరి వేంకట సుబ్బారావు


                    Advertise with us !!!