PM Modi to soon fly in VVIP aircraft Air India One

అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో మన దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యాటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం త్వరలో భారత్‌కు చేరనున్నది. దీనికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా, ఐఏఎఫ్, భద్రతా అధికారులు, సీనియర్ అధికారులతో కూడిన ఒక టీమ్ శుక్రవారం అమెరికా బయలుదేరింది.

అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉన్నది. ఈ ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానానికి అన్ని పరీక్షలు ముగిశాయి. దీని వినియోగానికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఒక టీం అమెరికా బయలు దేరినట్లు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.

అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలు కలిగిన ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానం ఏకధాటిగా 17 గంటలపాటు ప్రయాణించగలదు. ప్రస్తుతం వీవీఐపీలు వినియోగిస్తున్న బీ 747 జంబో విమానాన్ని ఇది భర్తీ చేస్తుంది. ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానాన్ని అమెరికా నుంచి ఎయిర్ ఇండియా స్వీకరించి దాని నిర్వాహణ బాధ్యతలను భారత వాయు సేన (ఐఏఎఫ్)‌కు అప్పగిస్తుంది.