jntu kakinada mou with missouri university

ఉన్నత విద్యకు సంబంధించి కీలకమైన రంగాల్లో పరిశోధనలు, అధ్యయనం కోసం ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని జేఎన్‍టీయూ కాకినాడ అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న బ్లాక్‍ చైన్‍, కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్‍ ఇంటిలిజెన్స్) రంగాల్లో ఈ రెండు విద్యా సంస్థలు పరిశోధనలు చేయనున్నాయి. దీనికిగానూ అమెరికా రూ.32,85,560 (44 వేల డాలర్లు)లను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో జేఎన్‍టీయూ కాకినాడతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మిస్సోరి విశ్వవిద్యాలయం.. జేఎన్‍టీయూ కాకినాడతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నతవిద్యకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించే ప్రయత్నాల్లో భాగంగా మిస్సోరి వర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్యలు ఫలించాయని అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విధ్య కో ఆర్డినేటర్‍ డాక్టర్‍ కుమార్‍ అన్నవరపు తెలిపారు.

ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు సంయుక్త పరిశోధనలు చేయనున్నారు. జేఎన్‍టీయుకే ఫ్రొఫెసర్లు, విద్యార్థులు మిస్సోరి వర్సిటీకి వెళ్లి, అక్కడి ప్రొఫెసర్లు ఇక్కడికి వచ్చి పరిశోధనల్లో పాలుపంచుకుంటారు. ఈ పరిశోధనలు ఏడాదిపాటు జరగనున్నాయి. పరిశోధనా ఫలితాలను సమీక్షించుకున్న తర్వాత ఈ ఒప్పందాన్ని మున్ముందు కొనసాగించనున్నారు. ఇలా ఐదేళ్లపాటు పరిశోధనల కోసం అమెరికా నుంచి నిధులు అందనున్నాయి. అదేవిధంగా బిగ్‍ డేటా, డేటా మైనింగ్‍లో భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి. మిస్సోరి విశ్వవిద్యాలయం ఈ ఏడాది దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక విశ్వవిద్యాలయం అది రాష్ట్రంలోని జేఎన్‍టీయూతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.

రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగానికి అంతర్జాతీయంగా గుర్తింపు, ప్రాచుర్యం కల్పించేదిశగా సర్కారు దృష్టి సారించిందని కుమార్‍ అన్నవరపు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంతో పాటు మన విద్యార్థులకు విదేశీ విద్యను సులభవంగా అందించే ప్రయత్నం చేయడం, వారికి ఫెలోషిప్పులు ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకే కాకుండా మన విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ట్రిన్నింగ్‍ పోగ్రామ్‍ కింద ఆంధప్రదేశ్‍ విద్యార్థులు రెండేళ్లు విదేశీ వర్సిటీల్లో చదువుకునే సౌలభ్యం కలుగుతుంది.