Rapaka varaprasad press meet

గెలిచింది ఒక్క ఎమ్మెల్యే. అత‌ను కూడా ఇప్పుడు తుమ్మినా, తుమ్మ‌కున్నా ఊడే ముక్కులా మార‌డంతో ఆంధ్ర‌ప్రదేశ్‌లో జ‌న‌సేన పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు జ‌న‌సేన త‌ర‌పున పోటీచేసిన అభ్య‌ర్ధులు అంద‌రూ అధ్య‌క్షుడితో స‌హా ఓడిపోగా ఒకే ఒక ఎమ్మెల్యే రాజోలు నుంచి గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ గుడ్డిలో మెల్ల‌ సంతోషం కూడా ఎక్కువ రోజులు మిగ‌ల‌కుండా గెలిచిన రెండో రోజు నుంచే రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వైకాపాకి అనుకూల రాగాలు ప‌లుకుతున్న‌దీ తెలిసిందే. గాలివాట‌మా? గాలికి పోయిందా? ఈ నేప‌ధ్యంలో 3 రోజుల క్రితం కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో రాపాక మాట్లాడిన మాట‌ల వీడియో బ‌య‌ట‌కి వ‌చ్చి అంది వైర‌ల్ గా మారింది. ఆ వీడియోలో రాపాక త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి మాట్లాడిన చాలా విష‌యాలున్నాయి

వాటిలో... తాను గ‌త ఎన్నిక‌ల ముందు వైసీపీ టిక్కెట్ కోసం ప్ర‌య‌త్నించాన‌ని, అయితే నియోజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల్లో భాగంగా త్రుటిలో అది చేజారింద‌ని ఆ రాపాక ఆ స‌మావేశంలో అన్నారు. ఆ త‌ర్వాత జ‌న‌సేన నుంచి ఓ నాలుగైదొంద‌ల మంది వ‌చ్చి వారి పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌మ‌న్నార‌ని ఇండిపెండెంట్‌గా కంటే ఏదో ఒక పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డ‌మే మంచిద‌నే ఉద్ధేశ్యంతో తాను జ‌న‌సేన‌లో చేరి పోటీ చేసి గెలిచాన‌న్నారు. అయితే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంట‌నే సిఎం వైఎస్ జ‌గ‌న్ త‌న‌తో సాద‌రంగా మాట్లాడార‌ని, తాను గెలుస్తాన‌ని తెలిసినా కొన్ని కార‌ణాల వ‌ల్ల టిక్కెట్ ఇవ్వ‌లేక‌పోయాన‌ని బాధ‌ప‌డ్డార‌ని చెప్పారు. త‌మ‌కు అనుబంధంగా కొన‌సాగ‌మ‌ని జ‌గ‌న్ కోరిన‌ట్టు ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. దీంతో తాను అప్ప‌టి నుంచే వైసీపీ ఎమ్మెల్యేగా మారిపోయాన‌న్నారు. తానిప్పుడు పూర్తిగా వైసీపీ మ‌నిషేన‌ని స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన ఏదో గాలివాటంగా వ‌చ్చి పోయిన పార్టీ మాత్ర‌మే న‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం అధికారికంగా వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల‌ను క‌లుపుకుపోతాన‌ని, ఎవ‌రితో గొడ‌వ‌లు త‌నకు న‌చ్చ‌వ‌ని కూడా స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ సూచ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకుంటాన‌న్నారు.

ఈ విధంగా రాపాక మాట్లాడిన మాట‌ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ వీడియోలో జ‌న‌సేన‌ను ఆయ‌న గాలివాటం పార్టీగా పేర్కొన‌డాన్ని వైసీపీ శ్రేణులు హైలెట్ చేశాయి. దీంతో ఇది జ‌న‌సేన అభిమానుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. రాపాక త‌మ పార్టీ వ‌దిలిపెట్ట‌డం అనేది ఎప్పుడో ఖాయ‌మైపోయిన సంగ‌తి తెలిసిందే అయినా జ‌న‌సేన పార్టీని హేళ‌న‌గా మాట్లాడ‌డంపై సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తం అయింది. తాజాగా ఈ విష‌య‌మై రాపాక వివ‌ర‌ణ ఇస్తూ తాను గాలివాటం అన‌లేద‌ని గాలికి వెళ్లిపోయే పార్టీ అన్నానంటూ స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న మాట‌ల్ని వ‌క్రీక‌రించి వైర‌ల్ చేశార‌న్నారు. జ‌న‌సేన బ‌లంతో పాటు త‌న బ‌లం కూడా తోడ‌వ‌డం వ‌ల్లే గెలిచాన‌న్నారు. త‌న స‌స్పెన్ష‌న్‌పై ఫేక్ న్యూస్‌లు ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. అధికార‌పార్టీ త‌ర‌పున ఉంటేనే ప‌నుల‌వుతాయిన్నారు. వాస్త‌వాలు తెలిశాక రాజీనామా గురించి ఆలోచిస్తాన‌న్నారు.