YSR Cheyutha will benefit 23 lakh women

మ‌ధ్య వ‌య‌సులో ఉన్న మ‌హిళ‌ల‌కు అండ‌దండ అందించేందుకే వైఎస్సార్ చేయూత అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఎన్నిక‌ల హామీల అమ‌లులో భాగంగా ఆయ‌న వైఎస్సార్ చేయూత ప‌ధ‌కాన్ని బుధ‌వారం త‌న క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రారంభించ‌డం త‌న‌ అదృష్టంగా భావిస్తున్నానన్నారు. త‌న‌ పాదయాత్ర స‌మ‌యంలో 45–60 ఏళ్ల మధ్యనున్న అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వ పథకాలేవీ వర్తించడం లేద‌నే విష‌యాన్ని గుర్తించాన‌న్నారు. వీరికి ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకమూ లేదని తెలుసుకున్నాన‌న్నారు. కాని కుటుంబాలను నడిపించే బాధ్యత వీరిదేన‌ని,వీరికి మంచి జరిగితే.. కుటుంబానికి మొత్తానికి మంచి జరిగినట్టేన‌ని భావించే వీరికి మంచి జరగాలనే ఈ పథకం రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. దీన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టామ‌ని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పథకాన్ని వర్తింపు చేస్తామని చెప్పామ‌ని అన్న‌ట్టుగా చేయ‌గ‌లుగుతున్నామ‌న్నారు.

గతంలో కార్పొరేషన్ల పేరుతో రుణాలు ఇచ్చేవారని అయితే ఊర్లో వేయిమంది ఉంటే.. ఒకరికో, ఇద్దరికో మాత్ర‌మే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేద‌న్నారు. అదికూడా రాజకీయపలుకుబడి ఉండి, లంచాలు ఇచ్చుకుంటేనే జ‌రిగేద‌న్నారు. దీనివల్ల ఎవ్వరికీ ఏమీ ప్ర‌యోజ‌నం ఉండేది కాద‌న్నారు. ఇవన్నీ మార్పులు చేస్తూ, మ‌ధ్య వయస్సులో ఉన్న అక్కలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లను ప్రక్షాళన చేశామ‌న్నారు. ఈ ప‌ధ‌కంలో భాగంగా మొదట పెన్షన్‌ రూపంలో డబ్బు ఇద్దామనుకున్నామ‌ని, వేయి రూపాయలు అనుకుంటే.. ఏడాదికి రూ.12వేలు ఇద్దామ‌ని ఆలోచించామ‌న్నారు. అప్పుడు 45ఏళ్లకే పెన్షన్‌ ఏంటి? అంటూ మమ్మల్ని వెటకారం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ త‌ర్వాత‌ ఏడాదికి రూ.12వేలు కాదు, రూ.18750 ఇస్తాం, నాలుగేళ్లపాటు చేయిపట్టుకుని నడిపిస్తాం అని చెప్పి పథకాన్ని తీసుకు వచ్చామ‌ని వివ‌రించారు.

ఈ ప‌ధ‌కంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లవరకూ ఉన్న మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల వరకూ ఇస్తున్నామ‌ని. ఈ డ‌బ్బుల ద్వారా తమ జీవితాలను మార్పు చేసుకునే అవకాశం మహిళలకు వస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మీ తమ్ముడిగా, అన్నగా చేయగలుగుతున్నాన‌ని, ఈ పథకంలో ల‌బ్ధిదారులైన అక్కల అకౌంట్లోకి నేరుగా బదిలీచేస్తున్నామ‌ని చెప్పారు. అంతేకాకుండా పాత అప్పులకి జమచేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నామ‌న్నారు. దీనికోసం బ్యాంకులతో మాట్లాడామ‌ని తెలిపారు.

అక్కలకు, చెల్లెమ్మలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వారి ముందుకు వ్యాపార అకాశాలను తీసుకు వస్తున్నామ‌న్నారు. పాల రంగంలో దేశంలోనే దిగ్గజ సంస్థ అమూల్‌తో ఒప్పందం చేసుకున్నామ‌ని, రియలన్స్, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నామ‌ని, రాబోయే కాలంలో మరిన్ని పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటామ‌ని వివ‌రించారు. మహిళలకు వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యంగా ప్రతి అక్కకు, చెల్లెమ్మకు 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నామ‌ని చెప్పారు. ప్రభుత్వం చూపుతున్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని, దాని ద్వారా మేలు పొందాలని అనుకుంటే... అన్ని విధాల స‌హ‌క‌రిస్తామ‌న్నారు. దీనికోసం బ్యాంకులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని తెలిపాప‌రు. కంపెనీలు.. తమ ఏజెన్సీలకు ఇచ్చే రేటుకన్నా తక్కువ రేటుకు తమ ఉత్పత్తులను మ‌హిళ‌ల‌కు ఇస్తార‌ని దీనివల్ల ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. త‌ద్వారా ఆర్థిక వృద్ది, సుస్థిర జీవనోపాధి పొందవచ్చున‌న్నారు.

గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఈ రెండు పేజీల లేఖతో మీ ముందుకు వస్తారని తమకు మేలు జరుగుతుందని అక్కలు అనుకున్నప్పుడు.. ఆ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న తర్వాత సెర్ప్, మెప్మా ప్రతినిధులు ఆ మహిళతో మాట్లాడతారని తెలిపారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతారు, బ్యాంకులతో ఆ అధికారులు మాట్లాడుతారు: ఆ వ్యాపారంలో వాళ్లు అడుగుపెట్టేలా ముందుకు సాగుతారని చెప్పారు. ప్రతి ఏటా ఇచ్చే రూ.18750 సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎన్ని ఉన్నా, అట్టడుగున ఉన్న మహిళలకు చేయూత నందించడానికి, వారి కాళ్లమీద వాళ్లు నిలబడ్డానికి ఈనిర్ణయం తీసుకున్నామ‌న్నారు. ఈ ప‌ధ‌కం ద్వారా దాదాపు 23 లక్షల కుటుంబాలకు ఈరోజు మేలు జరుగుతుందన్నారు.

జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనిలేదనీ గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవ‌చ్చున‌ని చెప్పారు. వచ్చే నెలలో ఈ దరఖాస్తులను పరిశీలించి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. 45 ఏళ్లు వయసు చేరుకున్న త‌ర్వాత‌ ప్రతి ఏటా మహిళలు ఈ పథకంలోకి వస్తారని మ‌హిళ‌కు 60 ఏళ్లు వచ్చే వరకూ ఈపథకం కొనసాగుతుందని తెలిపారు. అక్కడ నుంచి వారికి పెన్షన్‌ ప్రారంభం అవుతుందని వివ‌రించారు. ఆ సమయానికి ఏడాదికి దాదాపు రూ.30వేల రూపాయలు వస్తాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, వేణుగోపాల కృష్ణ, విశ్వరూప్, శంకరనారాయణ, ఎంపీ మార్గాని భరత్, సీఎస్‌ నీలం సాహ్ని, తదితర అధికారులతో పాప‌టు వివిధ జిల్లాలనుంచి లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.