Telangana CM KCR Video Conference with PM Narendra Modi

క‌రోనా వైరస్ వ్యాప్తి నివారణకు పటిష్ట‌మైన‌ చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి తెలిపారు. మంగళవారం ప‌లు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వ‌హించిన‌ సమావేశంలో కేసీఆర్‌ ప్రధానికి రాష్ట్రంలో కరోనా న‌యంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను ఏక‌ర‌వు పెట్టారు. ఇటీవ‌ల రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను బాగా పెంచామని కరోనా రికవరీ రేటు తెలంగాణలో 71శాతం దాకా పెరిగింద‌న్నారు. అదే స‌మ‌యంలో మరణాల రేటు 0.7శాతంగా మాత్ర‌మే ఉందని వివరించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుప‌త్రుల‌లో అవ‌స‌ర‌మైన స్థాయిలో పడకలు, మందులు సిద్ధంగా ఉంచామని, ఐసీఎంఆర్‌, నీతిఆయోగ్‌, కేంద్ర బృందాల సలహాలను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నామని చెప్పుకోచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. కరోనా నేర్పిన అనుభ‌వాల నేప‌ధ్యంలో దేశంలో వైద్య సదుపాయాలు మ‌రింత మెరుగు ప‌ర‌చాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో మెరుగైన మార్పుల కోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ప‌నిచేయాల్సి ఉంద‌న్నారు. కరోనా వైరస్‌లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది కాబ‌ట్టి వైద్య రంగంలో ఎంత‌టి విపత్కర పరిస్థితి అయినా తట్టుకునేలా జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులను నియమించడం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య‌ని మరింతగా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో కరోనా ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు బిహార్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బంగాల్ కూడా ఉన్నాయని ఈ రాష్ట్రాల్లో మరింతగా కొవిడ్ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు.ఈ 10 రాష్ట్రాల్లోనే దాదాపు 6 లక్షలకు పైగా కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అంటే 80 శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నాయని అన్నారు. టెస్టులు బాగా పెంచి ఈ రాష్ట్రాల్లో కరోనాను అదుపు చేయగలిగితే మొత్తం దేశం కరోనాను జయించినట్లవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.