tana-swatrantya-bharti-sahitya-harathi-program-on-aug-15

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో 74వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని తానా స్వాతంత్య్ర భారతి- సాహిత్య హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన 74 మంది సాహితీవేత్తలతో అంతర్జాలం ద్వారా ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి తెలిపారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ నిర్వాహకులు  డాక్టర్‍ ప్రసాద్‍ తోటకూర, సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ  శ్రీనివాస్‍  నిర్వహణలో ఈ అపూర్వమైన సాహిత్య సమ్మేళనం జరుగుతుందని, భారతదేశ స్వాతంత్రోద్యమం, జాతీయ సమైక్యత, దేశభక్తి వంటి అంశాలపై భారతీయుల్లో చైతన్యాన్ని కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 74 మంది  తెలుగు సాహితీవేత్తలు వచన కవిత్వం, గేయ కవిత్వం, పద్య కవిత్వం వంటి అనేక పక్రియల ద్వారా స్పూర్తిని కలిగిస్తారు. 

ప్రపంచ చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం జరిగిన తీరు, మన జాతీయ నాయకులు ప్రదర్శించిన వీరోచిత పోరాటాలు, వివిధ మార్గాల ద్వారా జాతిని ఏకం చేసి బ్రిటీష్‍ పాలన నుంచి విముక్తి కలిగించి  స్వాతంత్య్రాన్ని సాధించిన తీరును కవిత్వీకరించడం ద్వారా గొప్ప  చైతన్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానా ఏర్పాటు చేసింది. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, కలిగిన భారతీయులందరూ ఒక్కటై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి మరోసారి జాతీయ సమైక్యతా భావాన్ని ప్రోదిగొల్పటం  ఈనాడు అత్యంత ఆవశ్యకమైన విషయం. అది కవుల ద్వారా, కవిత్వం ద్వారా సాధ్యమవుతుంది. పౌరుల్లో దేశభక్తి లేనిది ఏ దేశం రాణించలేదు. దేశం కోసం శక్తిని యుక్తిని ధారపోసి దేశ శ్రేయస్సు కోసం పాటుపడే ఉదాత్తమైన దేశభక్తిని పెంపొందించటానికి గొప్ప మార్గమే సాహిత్యం.   ఈ సదుద్దేశ్యంతోనే ఈ మహా సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జయ్‍ తాళ్ళూరి వివరించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హిమాచల్‍ ప్రదేశ్‍  గవర్నర్‍  బండారు దత్తాత్రేయ, తమిళనాడు పూర్వ గవర్నర్‍ కొణిజేటి రోశయ్య, మహారాష్ట్ర పూర్వ గవర్నర్‍ చెన్నమనేని విద్యాసాగర్‍ రావు, తమిళనాడు పూర్వ గవర్నర్‍ పి. ఎస్‍. రామ్మోహన్‍ రావు హాజరై సందేశాలు అందిస్తారు. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‍, ప్రఖ్యాత సినీ గేయ రచయితలు చంద్రబోస్‍, అనంతశ్రీరామ్‍, రామజోగయ్యశాస్త్రి, భువనచంద్ర, డాక్టర్‍ సుద్దాల అశోక్‍ తేజ,  రసరాజు, వెన్నెలకంటి, చైతన్య ప్రసాద్‍, జె.కె.భారవి, శ్యామ్‍ కాసర్ల, సిరాశ్రీ, వడ్డేపల్లి కృష్ణ, అవధానులు డాక్టర్‍ కడిమెళ్ళ వరప్రసాద్‍, పాలపర్తి శ్యామలానందప్రసాద్‍,  మీగడ రామలింగస్వామి మరియు గుమ్మడి గోపాలకృష్ణ లతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దుబాయ్‍, ఒమన్‍, కెనడా వంటి దేశాల నుండే కాక ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, వంటి రాష్ట్రాలతో పాటు  రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖ సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఆగష్టు 15 సాయంత్రం 7:30 నిముషాల(IST) నుండి  www.facebook.com/TANA.ORG, తానా యుట్యూబ్‍ ఛానల్‍ www.youtube.com/channel/ మన టీవీ, టీవీ5లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.