bjp mind game in andhra pradesh politics

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ది వైకాపా. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ది తేదేపా. గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు ప్ర‌ధాన పార్టీలు దాదాపు 90శాతం పైగా ఓట్లు సాధించాయి. అధికార విప‌క్షాలుగా అవ‌త‌రించాయి. అలాంటి ఈ 2 పార్టీలను మించిపోయి రాష్ట్రంలో ఉనికే లేని  పార్టీ రాజ‌కీయ చ‌క్రం తిప్పుతుండ‌డం విశేషం. అంతేకాదు ఇంత‌టి బ‌ల‌మైన పార్టీలు కూడా త‌న ప్రాప‌కం కోసం పాకులాడే ప‌రిస్థితి ఆ పార్టీ తీసుకురావ‌డం మ‌రింత విచిత్రం. ఆ పార్టీయే భాజాపా. ఎన్నిక‌ల్లో వైకాపా గెలిచిన దగ్గ‌ర్నుంచి వ్యూహాత్మ‌కంగా భాజాపా పావులు క‌దుపుతున్న తీరు రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తోంది. వైకాపా గెలిచిన త‌ర్వాత వెంట‌నే న‌లుగురు తెదేపాకు చెందిన ప్ర‌ధాన మైన ఎంపీల‌ను చేర్చుకోవ‌డం ద్వారా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది భాజాపా. అప్ప‌టి నుంచి ఆ త‌ర్వాత త‌ర్వాత కూడా త‌న యుక్తిని ప్ర‌ద‌ర్శిస్తూనే వ‌స్తోంది. 

ఒక‌సారి వైకాపా నిర్ణ‌యాల‌కు త‌లాడిస్తూన్న‌ట్టు క‌నిపిస్తున్న భాజాపా మ‌రోవైపు వైకాపా స్వంత పార్టీలోని ప్ర‌త్య‌ర్ధుల‌కు రెడ్‌కార్పెట్ వేస్తోంది. తెలుగుదేశం అనుకూల పంధాను అవ‌లంభించిన క‌న్నాను కొంత కాలం కొన‌సాగించి, ఆ త‌ర్వాత అత‌ని స్థానంలో వైకాపా అనుకూలుడిగా పేరుప‌డ్డ సోము వీర్రాజును తీసుకొచ్చారు. అలాగే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారంలో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించి, వైకాపా ప్ర‌భుత్వానికి షాకిచ్చిన గ‌వ‌ర్న‌ర్ వెనువెంట‌నే ఓ వైపు 3 రాజ‌ధానుల బిల్లుకు ఆమోదం తెల‌ప‌డం ద్వారా విప‌క్షానికి షాక్ ఇచ్చారు. మ‌రోవైపు వైకాపా అస‌మ్మ‌తి ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజును ఎగ‌దోస్తూ, జ‌గ‌న్‌తో ఢీ అంటే ఢీ అంటున్న అత‌నికి కోరిన‌ట్టుగా వీవీఐపీ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను కేటాయించ‌డం ద్వారా వైకాపాని ఇరుకున‌బెట్టారు. 

అదే క్ర‌మంలో తాజాగా అమ‌రావ‌తి కి మ‌ద్ధతుగా నిర‌స‌న ఉద్య‌మంలో పాల్గొని చెప్పుతో కొట్టుకున్న భాజాపా అధికార ప్ర‌తినిధిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి తేదేపా నేత‌లు నొరెళ్ల‌బెట్టేలా చేశారు.  ఈ నేప‌ధ్యంలో ఓ వైపు తేదేపాను వీలైనంత బ‌ల‌హీనప‌ర‌చ‌డం, అదే స‌మ‌యంలో దానివ‌ల్ల వైకాపా మ‌రింత‌ బ‌ల‌ప‌డ‌కుండా చూడ‌డం అనే ల‌క్ష్యాల‌తో భాజాపా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే భాజాపా ఈ చ‌క్రం తిప్ప‌డానికి కేవ‌లం కేంద్రంలో అధికారం లో ఉండ‌డం ఒక్క‌టే కార‌ణం కాద‌ని తేదేపా, వైకాపా ప్ర‌ధాన నేత‌లు త‌మ‌ని తాము ర‌క్షించుకోవ‌డం కోసం భాజాపా పార్టీతో స్నేహం, అండ కోరుకోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు.  ఈ వ్యూహాలు ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తాయో భాజాపా ఎదుగుద‌ల‌కు ఎంత వ‌ర‌కూ ఉప‌క‌రిస్తాయో వేచి చూడాల్సి ఉంది.