chandrababu press meet

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తెలుగుదేశం నాంది పలికిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధప్రదేశ్‍లో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి గురించి దృశ్యమాధ్యమం ద్వారా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ అన్ని జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లామన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఈజ్‍ ఆఫ్‍ డూయింగ్‍ బిజినెస్‍లో ప్రథమ స్థానానికి తీసుకొచ్చామని చెప్పారు. పారిశ్రాక రంగంలో అగ్రగామిగా నిలిచామని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధికి కృషి చేశామని అన్నారు.

వరుసగా నాలుగేళ్లు రెండు అంకెల వృద్ధి సాధించిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని, వ్యవసాయాన్ని ఆధునీకరించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించామని తెలిపారు. రహదారులు, విద్యుత్‍ ఇలా అన్ని రంగాల్లో సమస్యలను అనతికాలంలోనే అధిగమించామన్నారు. పదమూడు జిల్లాల అభివృద్ధికి మేం చేం చేశామో చెబుతున్నాం.. ఈ పద్నాలుగు నెలల్లో మీరేం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఏది వాస్తవం, ఏదీ అవాస్తవం అనేది ప్రజలే గ్రహించాలన్నారు. ఏది నిజమైన అభివృద్ధి, ఏది నిజమైన విధ్వంసమో బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు.