Nara Rohit Chaitanya Dantuluri  Baanam Combination

`బాణం` సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో ప‌రిచ‌య‌మైన నారా రోహిత్‌కి ఆ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చైత‌న్య దంతులూరికి కూడా మంచి పేరు వ‌చ్చింది. `బాణం` త‌ర్వాత నారా రోహిత్ ఎన్నో సినిమాలు చేశాడు. కానీ, ఏ ఒక్క‌టీ అత‌ని కెరీర్‌కి హెల్ప్ అవ్వ‌లేదు. `సోలో` చిత్రం మాత్రం అత‌నికి విజ‌యాన్ని అందించింది. ఆ సినిమా త‌ర్వాత ఒక్క సినిమా కూడా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేదు. అయితే త‌ను చేసిన ప్ర‌తి సినిమా విభిన్నంగా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. అయినా ఫ‌లితం లేక‌పోయింది. అలాగే `బాణం` ద‌ర్శ‌కుడు చైత‌న్య‌కు కూడా హిట్ లేదు. ఆ త‌ర్వాత గౌత‌మ్‌తో `బ‌సంతి` అనే సినిమా చేశాడు. అది విజ‌యం సాధించ‌లేదు.

వెంక‌టేశ్ హీరోగా న‌టించిన `గ‌ణేష్‌` సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్ట‌ర్‌గా, సిద్ధార్థ్, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టించిన `ఓమై ఫ్రెండ్‌` చిత్రానికి ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసి `బాణం`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చైత‌న్య‌కు మంచి సినిమా ప‌డ‌లేదు. అందుకే నారా రోహిత్‌తో క‌లిసి మ‌ళ్లీ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. `బాణం` ఎంత విజ‌యం సాధించిందో దాన్ని మించిన విజ‌యం సొంతం చేసుకోవాల‌ని ఎంతో కృషి చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింది. 1971 యుద్ధ నేప‌థ్యంతో పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కే ఈ సినిమా `బాణం` త‌ర‌హాలోనే ఎంతో విభిన్నంగా ఉంటుంద‌ట‌. ఈ సినిమా కోసం నారా రోహిత్ త‌న లుక్‌ను కూడా మార్చుకున్నాడు. సెట్స్‌పైకి వెళ్ల‌డానికి అన్నివిధాలుగా నారా రోహిత్‌, చైత‌న్య సిద్ధంగా ఉన్నారు. అయితే క‌రోనా కార‌ణంగా షూటింగ్ చేయ‌లేని ప‌రిస్థితి ఉండ‌డంతో అన్నీ చ‌క్క‌బ‌డిన త‌ర్వాత నాన్‌స్టాప్‌గా షూటింగ్ ఫినిష్ చెయ్యాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే ఈ సినిమాను ఏ బేన‌ర్‌లో నిర్మిస్తారు. మిగ‌తా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌రు అనేది త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది