Rod Gopal Varma movie 1st look released and its satirical movie on RGV

ఏ భాష‌కు సంబంధించిన సినిమా ఇండ‌స్ట్రీలోనూ ఇలాంటి వ్య‌క్తి ఉండ‌డు. ప్ర‌తి విష‌యాన్నీ వివాదం చేస్తూ, త‌న‌కు సంబంధం లేని అన్ని విష‌యాల్లోనూ త‌ల‌దూరుస్తూ ఎంతో మందికి త‌ల‌నొప్పిగా మారిన ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. ఏ స‌బ్జెక్ట్‌తోనైనా సినిమా తియ్య‌గ‌ల స‌త్తా అత‌నికి ఉంది. ఎలాంటి వారి బ‌యోపిక్ అయినా ధైర్యంగా స్క్రీన్ మీద చూపించి క‌న్విన్స్ చెయ్య‌గ‌ల తెలివితేటలు ఉన్నాయి. గ‌తంలో అత‌ను చేసిన సినిమాలు అంత‌ర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకున్నాయి. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు అని అంద‌రూ కితాబులిచ్చారు. మ‌రి ఈమ‌ధ్య‌కాలంలో ఏమైందోగానీ ఐస్‌క్రీమ్‌తో అత‌ని కెరీర్ ట‌ర్న్ తీసుకుంది. ఎప్పుడు ఏ సినిమా తీస్తాడో తెలీదు. ఎవ‌ర్ని టార్గెట్ చేస్తాడో తెలీదు. ఎప్పుడు ఏ ట్వీట్ పెడ‌తాడో, ఎవ‌రిని కెలుకుతాడో తెలీదు. ఇలా ర‌క‌ర‌కాలుగా మారుతున్న అత‌ని బిహేవియ‌ర్ వ‌ల్ల ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంత‌మంది బ‌హిరంగంగా వ‌ర్మ‌పై విమ‌ర్శ‌లు చేస్తుంటే మ‌రికొంతమంది లోలోప‌ల కుమిలిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈమ‌ధ్య రోజుకో సినిమా ఎనౌన్స్ చేస్తూ సినిమా బిజినెస్‌లో కొత్త పుంత‌లు తొక్కుతున్నాడు. అంతేకాదు, రాజ‌మౌళి వంటి ద‌ర్శ‌కుల‌కు జ‌నం నుంచి ఈజీగా ఎలా డ‌బ్బు రాబ‌ట్ట‌వ‌చ్చో టిప్స్ కూడా ఇస్తున్నాడు. క్లైమాక్స్‌, నేక్‌డ్, ప‌వ‌ర్‌స్టార్ వంటి సినిమాల‌ను చ‌క‌చ‌కా తీసేసి రిలీజ్ చేసేసిన వ‌ర్మ ఇప్పుడు అమృత‌, ప్ర‌ణయ్ ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో రూపొందించిన మ‌ర్డ‌ర్ సినిమా రిలీజ్‌పై వివాదాల్లో ఇరుక్కున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు సెల‌బ్రిటీల జీవితాల‌పై వ‌ర్మ సినిమాలు తీస్తూ వ‌స్తుంటే... ఇప్పుడు వ‌ర్మ‌పై సినిమాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ నూతన్ నాయుడు `పరాన్నజీవి` అంటూ ఓ సినిమా చేసాడు. ఇప్పుడు మరో మూడు నాలుగు సినిమాలు ఆ దారిలోనే ఉన్నాయి. అందులో ఒకటి `ఆర్‌జివి`. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ర‌చ‌యిత జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు రూపొందిస్తున్నారు. వ‌ర్మ చేష్ట‌ల వ‌ల్ల జొన్న‌విత్తుల‌కు బాగా కాలింది. అందుకే ఆ క‌సిని అత‌నిపై సినిమా తీసి తీర్చుకోవాల‌ని చూస్తున్నాడు జొన్న‌విత్తుల‌. ఇప్పుడు `రాడ్‌గోపాల్‌వ‌ర్మ` పేరుతో మ‌‌రో కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు ద‌ర్శ‌కుడు మ‌ణి కె.ఎస్‌.  ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

'శివ' కి ముందు జరిగిన కథ అని టైటిల్‌లో ప్రకటించారు. దీనిలో వోడ్కా బాటిల్‌తో పాటు ఐరన్ రాడ్ కూడా ఉంది. దాంతో పాటే 'పలు బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న యువకుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు' అనే క్యాప్షన్ కూడా తగిలించారు. పోలీస్ కాళ్ల మధ్యలో నగ్నంగా కూర్చున్న వ్యక్తిని హైలైట్ చేసారు. మొదటి చాప్టర్‌గా ఈ సినిమా రాబోతోంది. ‘ఆ రోజు రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగిందో మీకు తెలుసా.. ఈ ఫిక్షనల్ రియాలిటీ సినిమాను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. త్వరలోనే ట్రైలర్ వచ్చేస్తుంది` అంటూ దర్శక నిర్మాతలు ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్పటి వరకు అంద‌రూ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా మారిన త‌ర్వాత ఎలా ఉన్నాడు అనే అంశంపై సినిమాలు చేస్తున్నారు.

కానీ, వర్మ దర్శకుడు కాక ముందు ఏం చేసేవాడు అనేది మేం చూపిస్తాం అంటున్నారు రాడ్‌గోపాల్‌వ‌ర్మ యూనిట్‌.  ఇండస్ట్రీకి రాకముందు ఈయన పంజాగుట్టలో సీడీ షాపు నిర్వహించేవాడనే విషయం అందరికీ తెలుసు. వ‌ర్మ ఇండ‌స్ట్రీకి రాక‌ముందు క‌థాంశం అంటే అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఎందుకంటే అంత‌కుముందు అత‌ను ఏం చేసేవాడు, ఎలా ఉండేవాడు అనేది తెలుసుకోవాల‌ని అంద‌రికీ ఉంటుంది. మరి ఈ సినిమాలో ఏం చూపిస్తార‌నేది అంద‌రిలోనూ మెదిలే ప్ర‌శ్న‌. తనపై ఎవ‌రు ఎన్ని సినిమాలు చేసినా, ఎలాంటి కామెంట్లు చేసినా వ‌ర్మ ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న సినిమాల‌తో బిజీగా ఉంటున్నాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ దృష్టంతా `అల్లు` అనే సినిమా పైనే ఉంది.