Mythri Movie Makers Upset With Koratala Siva

టాలీవుడ్‌లో కొర‌టాల శివ సినిమాల‌కు ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. త‌ను చేసే ప్ర‌తి సినిమాలోనూ స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే మంచి సందేశం ఉంటుంది. కేవ‌లం సందేశంతోనే ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్ట‌కుండా దానికి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని కూడా జోడించి జ‌నంలోకి తీసుకెళ్తాడు. ఆ విధంగానే ఇప్ప‌టివ‌ర‌కు మంచి విజ‌యాల‌ను అందుకున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో మ‌రో సామాజిక అంశంతో `ఆచార్య‌` చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం నిలిచిపోయింది. అయితే ఈ సినిమా నిర్మాణంలో ఉండ‌గానే మ‌రో సినిమా ఎనౌన్స్ చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు కొర‌టాల‌. ఆచార్య త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే దానికి భిన్నంగా అల్లు అర్జున్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ఎనౌన్స్ చేశాడు. కొర‌టాల స్నేహితుడు మిక్కిలినేని సుధాక‌ర్ స్థాపించిన యువ‌సుధ బేన‌ర్‌లో ఈ సినిమా ఉంటుంద‌ట‌. వాస్త‌వానికి ఆచార్య త‌ర్వాత మైత్రి మూవీ మేక‌ర్స్‌లో కొర‌టాల సినిమా చెయ్యాల్సి ఉంది. మైత్రితో సినిమా ఆచార్య కంటే ముందే క‌మిట్ అయ్యాడు. కానీ, స‌డ‌న్‌గా స్నేహితుడి బేన‌ర్‌లో సినిమా అని ఎనౌన్స్ చెయ్య‌గానే షాక్ అవ‌డం మైత్రి అధినేత‌ల వంతైంది.

ఈ విష‌యంలో మ‌రోసారి కొర‌టాల శివ‌ని సంప్ర‌దించిన మైత్రి అధినేత‌లు స్నేహితుడి బేన‌ర్‌లో సినిమా ఎందుకు చెయ్యాల్సి వ‌స్తుందో తెలుసుకొని క‌న్విన్స్ అయ్యార‌ట‌. ప్ర‌స్తుతం చిరంజీవితో చేస్తున్న `ఆచార్య‌`, ఆ త‌ర్వాత అల్లు అర్జున్‌తో చేసే సినిమా పూర్త‌యిన త‌ర్వాత మైత్రి మూవీ మేక‌ర్స్‌లో త‌ప్ప‌కుండా సినిమా చేస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ట‌. అయితే ఆ సినిమా ఏ హీరోతో చేస్తాడ‌నేది క‌న్‌ఫ‌ర్మ్ చెయ్యాల్సి ఉంది.