PM Narendra Modi says New Education Policy will shape the future of this century

దేశంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత విస్తృతమైన అధ్యయనం తర్వాతే కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్ల‌డించారు ఈ విద్యా విధానంపై దేశంలో ఆరోగ్యకరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు ఎంత ఎక్కువ చర్చ జరిగితే విద్యావ్య‌వ‌స్థ‌కు అంత ప్రయోజనం క‌లుగుతుంద‌ని అన్నారు. నూతన విద్యా విధానంపై శుక్రవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.కొత్త విద్యా విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని, విద్య నేర్చుకోవాలన్న కోరిక బాగా పెరుగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కొత్త జాతీయ విద్యా విధానంతో దేశానికి విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయ‌ని తెలిపారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చామని అన్నారు. చిన్నారులు, యువతలో సృజనాత్మకత నిశిత పరిశీలన, ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేలా ఈ విద్యా విధానం ఉందని ఆయన చెప్పారు. చిన్నారులు తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఒకే దేశం - ఒకే విద్యా విధానం ఉండాలని, రాష్ట్రాలన్నీ కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 21 వ శతాబ్దంలో విద్యార్థులు నైపుణ్యాలపై ఈ విధానం దృష్టి పెడుతుందని, కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త విద్యా విధానంపై ఎవ్వరికీ అపోహలుండాల్సిన అవసరం లేదని, భవిష్యత్ లక్ష్యాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ విధానం లక్ష్యమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.