JC Prabhakar Reddy Arrested Again

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు నుంచి విడుద‌లై 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే మ‌రోసారి అరెస్ట్ అయ్యారు. ఆయ‌నపై ప్ర‌ధానంగా అట్రాసిటీ కేసుతో పాటు మొత్తం 5 కేసులు నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు. క‌డ‌ప సెంట్ర‌ల్‌ జైలు నంచి కొడుకు అస్మిత్‌రెడ్డితో క‌లిసి 53 రోజుల త‌ర్వాత శుక్ర‌వారం విడుద‌ల‌య్యాక భారీ సంఖ్య‌లో వ‌చ్చిన అనుచ‌రుల‌తో క‌లిసి తాడిప‌త్రికి ర్యాలీగా బ‌య‌లుదేరిన జెసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మార్గ‌మధ్యంలో త‌న‌ను ప్ర‌శ్నించిన‌ పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. అంతేకాకుండా ట్రాఫిక్ లో విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ దళిత సీఐ దేవేంద్ర ను జేసీ ప్రభాకర్ రెడ్డి..దూషించారు. దీంతో పోలీసులు జెసీపై కేసు న‌మోదు చేశారు. ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత కడప నుంచి తాడిపత్రి దాకా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పై 506, 189, 353 సెక్షన్ల కింద పోలీసులు ప‌లు కేసులు నమోదు చేశారు.

జేసీ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ 52 కింద కూడా కేసు నమోదు చేయ‌డం విశేసం. ఈ కేసుల నేప‌ధ్యంలో మ‌రోసారి జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్లో భాగం తాడిపత్రి లో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆయ‌న్ను అనంత‌ర‌పురం పోలీసులు గుత్తి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.