CM YS Jagan review meeting on Higher Education

ప్ర‌స్తుతం లాక్ డ‌వున్ 3.0లో భాగంగా మూసివేసి ఉన్న క‌ళాశాల‌ల‌ను అక్టోబ‌రు 15 నుంచి తెర‌వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఉన్న‌త విద్యా విధానంపై గురువారం ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాలేజీల్లో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెరగాలన్నారు. ప్ర‌స్తుతం తాము ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామ‌ని దీని వల్ల కచ్చితంగా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెరగాల‌ని అలా జ‌రిగితేనే ఈ ప‌ధ‌కాల వ‌ల్ల పూర్తి ప్ర‌యోజ‌నం సాధించినట్టుగా భావించ‌గ‌ల‌మ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న  32.4 శాతం ఎన్‌రోల్‌మెంట్‌ని  90 శాతానికి తీసుకెళ్లాలన్నారు. అంతేకాకుండా పాఠ్య ప్రణాళికలోనూ మార్పులు తీసుకు రావడంలో భాగంగామూడేళ్ల‌ డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చామ‌ని, దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని తెలిపారు. దాన్ని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామ‌న్నారు. వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్‌ ఉంటుందని చెప్పారు. దీనికి అదనంగా 20 అడిషనల్‌ క్రెడిట్స్‌ సాధించేవారికి కూడా ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వాలన్నారు. అడ్మిషన్ల స‌మ‌యంలోనే సాధారణ డిగ్రీ కావాలా? లేదా ఆనర్స్‌ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. అదే విధంగా చదువులు చెప్పే విధానంలో మార్పులు రావాలని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మంచి పాఠ్య ప్రణాళిక వల్ల డిగ్రీలకు విలువ ఉంటుందన్నారు. ప్రభుత్వ కాలేజీలను మెరుగు పరుద్దామన్న ఆలోచన గతంలో ఎవ్వరికీ రాలేదని అయితే ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలతో బోధన అందించాలని మనం ప్రయత్నం చేస్తున్నామ‌న్నారు. అదే స‌మ‌యంలో అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. 

పాత మెడికల్‌ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు – నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా అధికారుల స్పందిస్తూ కర్నూలులో క్లస్టర్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

పాడేరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ప్రతి ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో.. వచ్చే మూడు నాలుగేళ్లలో వీటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇదే స‌మ‌యంలో యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీకి సీఎం ప‌చ్చ జెండా ఊపారు. దాదాపు 1110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. లాక్ డ‌వున్ అనంత‌రం అక్టోబరు 15న కాలేజీలు తెరవాలని, సెప్టెంబరులో సెట్‌ల నిర్వహణ పూర్తి కావాలని నిర్ణ‌యించారు. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన అమ‌లు చేసేందుకు పూర్తిగా సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులకు ఆదేశించారు. ఉన్న‌త విద్య‌పై జ‌రిగిన స‌మీక్ష‌లో ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.