KTR confident on first Covid vaccine rolling out from Hyderabad

తక్కువ ధరలోనే కోవ్యాక్సిన్‍

కరోనా వ్యాధి నివారణకోసం తయారు చేస్తున్న వ్యాక్సిన్‍ కోసం ఎక్కువ దేశాల చూపు భారత్‍ వైపే ఉంది. అందులోనూ ఫార్మాకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‍ వైపే అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. 

హైదరాబాద్‍లో వ్యాక్సిన్‍ రేస్‍- బ్యాలెన్సింగ్‍ సైన్స్ అండ్‍ అర్జెన్సీ అంశంపై వెబినార్‍ జరిగింది. ఈ కార్యక్రమం వేదికగా కరోనా వ్యాక్సిన్‍ అభివృద్ధిపై దృష్టి సారించిన మూడు హైదరాబాదీ దిగ్గజ ఔషధ కంపెనీల నిర్వాహకుల మనసు విప్పి మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‍పై సానుకూల ప్రకటనలను వినిపించడమే కాదు. వ్యాక్సిన్‍ యజ్ఞంలో ప్రభుత్వాల నుంచి తమకు అందాల్సిన సహాయసహకారాలపైనా గొంతు విప్పారు. తాము ఉత్పత్తి చేయబోయే కోవ్యాక్సిన్‍ ధర వాటర్‍ బాటిల్‍ కన్నా తక్కువే ఉంటుందనే తీపి కబురును భారత్‍ బయోటెక ఎండీ కృష్ణ ఎల్లా వినిపించారు.

వ్యాక్సిన్‍ అభివృద్ధి అనేది రేసు కాదని, ఒక బాధ్యత అని ఇండియన్‍ ఇమ్యూనోలాజికల్స్ ఎండీ డాక్టర్‍ ఆనంద్‍ కుమార్‍ పేర్కొన్నారు. వ్యాక్సిన్‍ అభివృద్ధి విషయంలో రోగుల ఆరోగ్య భద్రతకే పెద్దపీట వేస్తామని బయలాజికల్‍ ఈ ఎండీ మహిహ దాట్ల సృష్టం చేశారు. ఇక ఈ వర్చువల్‍ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‍ సౌమ్య స్వామినాథన్‍ కూడా జెనీవా నుంచి పాల్గొన్నారు.  గంటన్నర పాటు జరిగిన ఈ వెబినార్‍కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‍ అనుసంధానకర్త (మోడరేటర్‍)గా వ్యవహరించి.. ఆ నలుగురికి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టడం విశేషం. అంతకుముందు జినోమ్‍ వ్యాలీని కేటీఆర్‍ సందర్శించారు...

కేటీఆర్‍  కొవిడ్‍ ముప్పు ఇంకా ఎంతకాలం ఉంటుంది ?

డాక్టర్‍ సౌమ్య స్వామినాథన్‍ (డబ్ల్యూహెచ్‍వో) : కొవిడ్‍ గండం నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వాలతో పాటుగా సామాజిక స్థాయిలోనూ ప్రయత్నాలు చేయాలి. లాక్‍డౌన్‍ వల్ల కరోనా వ్యాప్తిని ప్రభుత్వాలు కొంత వరకూ అరికట్టగలిగాయి. అయితే ఈ సమస్యను దీర్ఘకాలంపాటు ఎదుర్కోవాలంటే వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలి. పరీక్షలు చేయకుండా కొవిడ్‍తో పోరాడటమంటే కళ్లకు గంతలు కట్టుకొని మంటలను ఆర్పటానికి ప్రయత్నించడం లాంటిది. ఎక్కడైనా కొవిడ్‍ సోకిన వ్యక్తుల రేటు ఐదు శాతం కన్నా తక్కువ ఉంటే. అక్కడ ఎక్కువ పరీక్షలు జరగనట్లే లెక్క. ఒకసారి వ్యాక్సిన్‍ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని ప్రపంచంలోని ప్రజలందరికీ ఎలా అందించాలనేది కూడా ఒక సమస్యే. గతంలో సార్స్, హెచ్‍ 1 వంటి సాంక్రమిక వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని దేశాలు ఆ వ్యాక్సిన్లను దాచేశాయి. ఆ తర్వాత వాటిని విడుదల చేశాయి. ఈసారి అలా జరగకుండా ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా ప్రజలందరికీ వ్యాక్సిన్‍ అందించటానికి తగిన రెగ్యులేటరీ ఫ్రేమ్‍వర్క్ ను రూపొందిస్తున్నాం.

కేటీఆర్‍ : భారత్‍ బయోటెక్‍, బయలాజికల్‍ ఈ, ఇండియన్‍ ఇమ్మునోలాజికల్స్ ను దేశంలోని అగ్రగామి వ్యాక్సిన్‍ ఉత్పత్తి సంస్థలు. వ్యాక్సిన్‍ అభివృద్ధి ఎక్కడి దాకా వచ్చిందో చెప్పండి.

డాక్టర్‍ కృష్ణ ఎల్లా (భారత్‍ బయోటెక్‍) : సాధారణంగా ఒక వ్యాక్సిన్‍ అభివృద్ధి చేయాలంటే 14 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అలాంటిది మేము 12 నుంచి 18 నెలల్లోనే అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఈ పక్రియ  అత్యంత క్లిష్టమైనది. చాలా జాగ్రతత్తగా కూడా ఉండాలి. ఈ పక్రియను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తునప్పటికీ, సైన్సుకు సంబంధించిన అంశాల్లో ఎటువంటి షార్ట్కట్‍లు అనుసరించడం లేదు. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీలెన్నో అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడుకొని త్వరగా వ్యాక్సిన్‍ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం.

మహిమ దాప్ల ( బయలాజికల్‍ ఈ) : వ్యాక్సిన్ల తయారీలో మనకు దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవముంది. కొవిడ్‍ను ఎదుర్కోవడానికి ఈ అనుభవాన్ని వాడుకోవాలనుకుంటున్నాం. మేం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‍ విజయవంతమైతే 8 నుంచి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నాం..

డాక్టర్‍ అనంద్‍ (ఇండియన్‍ ఇమ్యునోలాజికల్‍): ఇది ఒక  రేసు అని నేను భావించడం లేదు. దీన్ని ఓ బాధ్యతగా భావిస్తున్నా. మన దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారనుకుందాం. వీరిలో 70 శాతం మందికి వ్యాక్సిన్‍ అవసరమనుకుందాం. వ్యాక్సిన్‍ ధర వెయ్యి రూపాయలు అనుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అందువల్ల మేము అత్యంత సమర్ధమైన వ్యాక్సిన్‍ను తక్కువ ధరకు అందించాలని ప్రయత్నిస్తున్నాం. దీన్ని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలనుకుంటున్నాం.

మహిమ దాట్ల : వ్యాక్సిన్‍ ఉత్పత్తిదారులు ఒకరితో మరొకరు కలిసి పనిచేయాల్సిన అవసరముంది. అయితే దీనికి రెగ్యులేటరీ మెకానిజం అనుమతించదు. ఉదాహరణకు ఒక వ్యాక్సిన్‍ ఉత్పత్తిదారుడి వద్ద అదనపు సామర్థ్యం ఉందనుకుందాం. దాన్ని వాడుకోవాలంటే రెగ్యులేటరీ అథారిటీల నుంచి అనుమతులు తీసుకోవాలి. దీనికి 6నుంచి 8 నెలలు పడుతుంది. ఇలాంటి అడ్డంకులు లేకపోతే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.

కృష్ణ ఎల్లా : అందరూ కలిసి పనిచేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన దేశంలో తయారయ్యే 100 వ్యాక్సిన్‍ డోసుల్లో సీరం ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియా(ఎస్‍ఐఐ) కేవలం 30 డోసులే తయారుచేస్తుంది. మిగిలిన 70 డోసులను హైదరాబాద్‍లో ఉన్న మా కంపెనీలే తయారు చేస్తాయి. వ్యాక్సిన్‍ల ఉత్పత్తి చేయడానికి అవసరమైన వాతావరణం హైదరాబాద్‍లో ఉంది. మన దేశంలో ఇన్నోవేషన్‍కు తెలంగాణ సారథ్యం వహిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

కేటీఆర్‍ : మీ ముగ్గురు ఒక వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి అనుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

మహిమ దాట్ల: వ్యాక్సిన్‍ అభివృద్ధి ఒకటే సరిపోదు. ఆ వ్యాక్సిన్‍ను అందరికీ అందించడానికి అవసరమైన సదుపాయాలు కూడా ఉండాలి. ఉదాహరణకు వ్యాక్సిన్‍ను నింపడానికి సీసాలు (వయల్స్) అవసరం. వాటిని తయారు చేసే పరిశ్రమలు కూడా ఇప్పుడు ముఖ్యమే మన వ్యాక్సిన్‍ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ నిపుణులైన సిబ్బంది అవసరమవుతారు.

కృష్ణ ఎల్లా : ప్రభుత్వం దీన్ని ఒక ఆరోగ్య సమస్యగా చూస్తోంది. కానీ ఇది ఒక ఆర్థిక సమస్య కూడా. మన దేశంలో 130 కోట్ల జనాభా ఉంది. వీరిలో అవసరమైన  వారందరికీ తక్కువ ధరకు వ్యాక్సిన్‍ను ఎలా అందించాలనే విషయం దృష్టి పెట్టాలి. మేము ఉత్పత్తి చేసే కోవ్యాక్సిన్‍ ధర వాటర్‍ బాటిల్‍ ధర కన్నా తక్కువ ఉంటుంది. అయితే నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడం. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుతం ఢిల్లీ ఈ విషయంలో నాయకత్వ కొరత ఉందనిపిస్తోంది.

కేటీఆర్‍ : మీరు రెగ్యులేటరి మెకానిజం గురించి మాట్లాడుతున్నారు కదా. దీనిలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారో చెబితే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ఒక లేఖ రాస్తాం. ప్రపంచ వ్యాక్సిన్‍ రాజధానిగా హైదరాబాద్‍ ఎదగాలనేది మా లక్ష్యం.

కృష్ణ ఎల్లా : ప్రస్తుతం వ్యాక్సిన్‍లు, మందుల ఉత్పత్తిపై 90 శాతం నియంత్రణ కేంద్రానిదే. దీనిని వికేంద్రీకరణ చేయాల్సిన అవసరముంది. ఉదాహరణకు దేశంలో మొత్తం ఫార్మా ఉత్పత్తుల్లో 60 శాతం హైదరాబాద్‍ నుంచే వస్తాయి. అయినా ప్రతి చిన్న అనుమతికి ఢిల్లీకి వెళ్లాలి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే డీబీటీకి సీడీఎస్‍ఏలకు చెందిన కార్యాలయాలు హైదరాబాద్‍లో పెడితే బాగుంటుంది. ఇక ఔషధ పరీక్షల కోసం హిమాచల్‍ప్రదేశ్‍లోని కసౌలిలో ఉన్న సెంట్రల్‍ డ్రగ్స్ లేబొరేటరీకి వెళ్లాల్సి వస్తోంది. మన రాష్ట్రంలోనూ ఒక టెస్టింగ్‍ ఫెసిలిటీ పెడితే మంచిది.

కేటీఆర్‍ : చివరగా వ్యాక్సిన్‍ ఎప్పుడు వస్తుందనుకుంటున్నారు?

మహిహ దాట్ల : వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్‍ మధ్యలో ఐదు వ్యాక్సిను సిద్ధమవుతాయని అనుకుంటున్నా.

డాక్టర్‍ ఆనంద్‍: వచ్చే ఏడాది జూన్‍ నుంచి సెప్టెంబరులోగా వ్యాక్సిన్‍ వస్తుందనుకుంటున్నా. మేం తయారు చేసే వ్యాక్సిన్‍ అత్యాధునికమైనది. ఒకసారి వాడితే సరిపోతుంది.

కృష్ణ ఎల్లా : వచ్చే ఏడాది చివరినాటికి 10 నుంచి 15 వ్యాక్సిన్లు వస్తాయనుకుంటున్నా. కొవిడ్‍ పరిశోధనల ప్రత్యేకత ఏమిటంటే కేన్సర్‍ బయాలజిస్టులు కూడా వీటిలో పాల్గొంటున్నారు. వారి అనుభవాన్ని కూడా వ్యాక్సిన్‍ అభివృద్ధికి జోడిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి.