ISB To Work With Andhra Pradesh Government To Boost Economy

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమగ్రాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి మేకపాటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-ఐఎస్ బీ తో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది బుధవారం ఉద‌యం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో  ఏపీ ఈడీబీ, సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, ఐఎస్ బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలతో ఈ ఒప్పందం జరిగింది.  విజ్ఞానం, అధ్యయనం, విశ్లేషణ, పరిశోధన, ప్రణాళికతో కూడిన వ్యూహాత్మక అభివృద్ధికోసమే ఐఎస్‌బితో ఈ ఎంవోయూ కుదుర్చుకున్నామని  మంత్రి మేకపాటి వ్యాఖ్యానించారు. తాజా ఒప్పందంతో కోవిడ్-19  అనంతర పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్  పేర్కొన్నారు.  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఎంవోయూ కుదుర్చుకోవడం కొత్త ఉత్సాహాన్ని, మరింత బాధ్యతను పెంచిందని ఐఎస్‌బి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే చెప్పారు.

ఎపీ-ఐఎస్‌బీ ప‌బ్లిక్ పాల‌సీ ల్యాబ్ ఏర్పాటు

రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ ల్యాబ్" ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఈ ల్యాబ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశించిన విధంగా ప్రజా పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం, త్వరితగతిన కచ్చితమైన నిర్ణయాలు, ఖర్చులనుతగ్గించడం వంటి లక్ష్యాలను దశలవారీగా చేరుతామన్నారు.  కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పునరుద్ధరణలో విశాఖ పట్టణాన్ని కీలకంగా మార్చడం,  రాయలసీమలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యత, ఈ-గవర్నెన్స్ కు పెద్దపీట, నైపుణ్య, శిక్షణలో సరికొత్త విధానాలను తీసుకువస్తామన్నారు మంత్రి మేకపాటి.  జూన్ 24న మొదటి సారి సమావేశమై..ఆగస్ట్ 5వ తేదీలోగా అవగాహన ఒప్పందం కుదరడం..త‌మ అంకితభావం, తపనకు నిదర్శనమని.. మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజలకు భరోసాతో కూడిన భవిష్యత్ అందించే దిశగా ప్రభుత్వం దార్శనిక ఆలోచనలతో ముందుకు వెళుతుండడాన్ని ఐఎస్ బీ సంస్థ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ అభినందించారు.  సమాజ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరడంలో సలహాలను తీసుకుని వాటిని నిర్దేశించుకున్న సమయానికే చేరుకోవడంలో అంకితభావంతో కూడిన‌ భాగస్వామ్యమందిస్తామని డీన్ రాజేంద్ర పేర్కొన్నారు.

ఈ 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ' అవగాహన ఒప్పంద కార్యక్రమంలో  పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, పరిశ్రమల శాఖ కమిషనర్, సుబ్రహ్మణ్యం జవ్వాది , నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, ఐ.టీ శాఖ సలహాదారులు, లోకేశ్వర్ రెడ్డి,  విద్యాసాగర్ రెడ్డి, ఐఎస్ బీ ప్రతినిధులు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భగవాన్ చౌదరి త‌దిత‌రులు పాల్గొన్నారు.