anil ravipudi to direct balakrishna

ప‌టాస్‌తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అనిల్ రావిపూడి వ‌ర‌స‌గా సూప‌ర్‌హిట్ సినిమాలు చేస్తూ డైరెక్ట‌ర్‌గా త‌న రేంజ్‌ను సినిమా సినిమాకీ పెంచుకుంటూ పోతున్నాడు. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2, స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి సూప‌ర్‌హిట్స్‌తో డైరెక్ట‌ర్‌గా త‌న‌కు తిరుగులేద‌ని ప్రూవ్ చేసుకున్న అనిల్ ఇప్పుడు ఓ కొత్త త‌ర‌హా సినిమాకి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడ‌ని తెలిసింది. కొత్త త‌ర‌హా సినిమా అని ఎందుకు అనాల్సి వ‌చ్చిందంటే.. ఈసారి అనిల్ డైరెక్ట్ చెయ్య‌బోయే హీరో బాల‌కృష్ణ‌. ఇప్ప‌టివ‌ర‌కు అనిల్ చేసిన సినిమాల్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండేలా చూసుకున్నాడు. అందులో హండ్రెడ్ ప‌ర్సెంట్ స‌క్సెస్ అయ్యాడు. ఇంత‌కుముందు చేసిన సినిమాల హీరోల వ‌ల్ల అది వ‌ర్కువుట్ అయ్యింది. మ‌రి బాల‌కృష్ణ‌తో అలాంటి సాహ‌సం చెయ్య‌డం క‌రెక్టేనా? అనేది సినీవ‌ర్గాల సందేహం.

 

బాల‌కృష్ణ సినిమా అన‌గానే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కంటే హీరో ఎలివేష‌న్ ఎక్కువగా ఉంటుంది. ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇవ‌న్నీ బ్యాలెన్స్ చేస్తూనే త‌న మార్క్ కామెడీని అనిల్ అందించ‌గ‌ల‌డా? అనేది ఆలోచించాల్సిన విష‌యం. బాల‌కృష్ణ‌తో సినిమా అన‌గానే అనిల్ త‌న ట్రెండ్‌ను మార్చుకున్నాడా అనే సందేహం కూడా క‌లుగుతుంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి నెక్స్‌ట్ మూవీ మాత్రం బాల‌కృష్ణ‌తోనే అనేది క‌న్‌ఫ‌ర్మ్ అయిపోయింద‌ట‌. బాల‌కృష్ణ‌కు క‌థ చెప్ప‌డం, బాల‌కృష్ణ ఓకే చెప్ప‌డం కూడ జ‌రిగిపోయింద‌ట‌.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అది పూర్తి కాగానే అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. మ‌రి బాల‌కృష్ణ‌ను త‌న సినిమాలో ఎంత కొత్త‌గా చూపిస్తాడో.. అభిమానుల్ని ఎంత‌గా ఆక‌ట్టుకుంటాడో వేచి చూడాల్సిందే.