Police arrest miscreants who threaten Mohan Babu

సినీనటుడు మోహన్‌బాబు ఇంటి దగ్గర హల్‌చల్‌ చేసిన వ్యక్తులను ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి కారులో వచ్చి ఆయనను ఉద్దేశించి ఆగంతకులు హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.  వాచ్‌మెన్‌ ఇచ్చిన సమాచారంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చెందిన మోహన్‌బాబు కుటుంబీకులు పహాడిషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా AP 31 AN‌ 0004 నంబరు గల ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కార్‌ నెంబర్‌ ఆధారంగా మోహన్ బాబు ఇంటికి వచ్చింది మైలార్‌దేవ్ పల్లిలోని దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నలుగురు ఆగంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి కాలేడేటాను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన వారు కావాలని చేశారా... లేక ఎవరైనా పంపించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.