Hyderabad silver bricks for the construction of Rama Mandir

భారతదేశంతోపాటు ప్రపంచంలోని రామభక్తులంతా ఎదురు చూస్తున్న క్షణం వచ్చింది. ఈనెల 5వ తేదీన అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయ నిర్మాణ భూమిపూజకు సర్వం సిద్ధమవుతోంది. ఈ భూమిపూజను పురస్కరించుకుని అయోధ్య నగరాన్ని ఉత్తర ప్రదేశ్‍ ప్రభుత్వం సర్వాంగసుందరంగా అలంకరిస్తోంది. పూర్తిగా లైట్లతో నింపేసింది. సాయంత్రం అయితే చాలు సిటీ మొత్తం ధగధగలే. ఈభూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటూ... 200 మంది ప్రముఖులు వస్తున్నారు కాబట్టి దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి ఆలయ స్థలానికి బంగారు, వెండి పూతతో ఇటుకలు వస్తున్నాయి. అలాగే ఆలయాల నుంచి మట్టి, నదుల నుంచి పవిత్ర జలాలు వస్తున్నాయి.

అయోధ్యలో జరిగే రామమందిర నిర్మాణంలో హైదరాబాద్‍ నగరం కూడా కీలకపాత్ర పోషిస్తోంది. నగరానికి చెందిన ఓ ఇంజినీర్‍ తయారు చేయించిన ఐదు వెండి ఇటుకలతో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనుండటం విశేషం. సదరు ఇటుకలను హైదరాబాద్‍లో పవన్‍కుమార్‍ ఫౌండేషన్‍ వ్యవస్థాపకులు, వెండి ఇటుకల రూపకర్త చల్లా శ్రీనివాస్‍, అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కమలేష్‍ మహరాజ్‍, డాక్టర్‍ నాగార్జున శర్మ దంటు, ఆదిశంకరాచార్య భక్తసమాజం సెక్రటరీ గంటి నాగేష్‍, చల్లా శివకిరణ్‍, తెలుగు టైమ్స్ ఎడిటర్‍ చెన్నూరి వెంకట సుబ్బారావు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామమందిర నిర్మాణ శంకుస్థాపన నేపథ్యంలో మార్చి 18న ఒక వెండి ఇటుకను తయారు చేయించి అయోధ్య రామ మందిరం కమిటీ అధ్యక్షులు నిత్య గోపాల్‍ దాస్‍, ప్రధాన కార్యదర్శి చంపత్‍ రాయ్‍, అయోధ్య కలెక్టర్‍లకు పంపామన్నారు. వాటిని పరిశీలించిన కమిటీ సభ్యులు మరో నాలుగు ఇటుకలు తయారు చేయించాలని వాటితోనే ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన చేద్దామని సూచించినట్లు తెలిపారు. దీంతో మరో నాలుగు వెండి ఇటుకలు తయారు చేయించామని, వాటిని కూడా వారికి అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఒక్కో ఇటుక రెండు కిలోలలకు పైగా ఉంటుందని ఇటుకలపై తెలుగు, హిందీ, ఇంగ్లిష్‍లో జై శ్రీరామ్‍ అని రాసినట్లు తెలిపారు. మొత్తం 35 వెండి ఇటుకలు ఇస్తామని చెప్పామని, మిగతా వాటిని కూడా త్వరలోనే అందజేస్తామన్నారు.

తెలుగు వారి సాకర్యార్థం అయోధ్యలో తెలుగు ఆశ్రమం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, అందుకు కమిటీ సుముఖత వ్యక్తం చేస్తూ నాలుగు ఎకరాల స్థలం కేటాయించినట్లు కమలేష్‍ మహరాజ్‍ వివరించారు. వెండి ఇటుకలతో పాటు గోదావరి నీటిని కూడా తీసుకెళుతున్నామన్నారు.

రామ మందిరం భూమిపూజ సందర్భంగా అయోధ్యలో 3 లక్షల దీపాలు వెలిగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలోని అన్ని ప్రధాన ఆలయాలు, మఠాల్లో ఈదీపాలను వెలిగిస్తారు. విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అందరూ ఇందులో పాలుపంచుకుంటున్నారు. అలాగే తెలంగాణలోనూ, ఇతర చోట్లా రామభక్తులు దీపాలను వెలిగించాలని కోరుతున్నారు.