Janasena Meeting On AP 3 Capitals

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని వ్య‌వ‌హారం కీల‌క ద‌శ‌కు చేరుకుంది. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం త‌ర్వాత‌ ప్ర‌భుత్వం 3 రాజ‌ధానుల‌పై మ‌రింత ప‌ట్టుద‌ల‌గా ముందుకు వెళుతోంది. అయితే రాజ‌ధాని  అంశంపై ఎలా వ్య‌వ‌హ‌రించాలి అనేదానిపై జ‌న‌సేన పార్టీ, ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని గ‌ట్టిగా డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిన ప‌రిస్థితుల్లో ఆయ‌న కొంత కాలం క్రిత‌మే భాజాపాతో జ‌ట్టు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డి నుంచి ఈ రెండు పార్టీలు మిత్ర‌ప‌క్షాలుగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌భుత్వంపై ఉమ్మ‌డి నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి. 

ఈ నేప‌ధ్యంలో తాజాగా గ‌వ‌ర్న‌ర్ వైసీపీ ప్ర‌భుత్వ వైఖ‌రికి అనుకూలంగా వికేంద్రీక‌ర‌ణ బిల్లుల‌ను ఆమోదం తెలప‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం వెలువ‌డిన వెంట‌నే విప‌క్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. అయితే ఆది నుంచీ అమ‌రావ‌తికి గ‌ట్టి మ‌ద్థ‌తు దారుగా ఉన్న ప‌వ‌న్ మాత్రం ఈ సారి అంతే గ‌ట్టిగా ప్ర‌తిస్పందించ‌లేక‌పోయారు. రాజ‌ధాని అంశం ఇప్పుడు అన‌వ‌స‌ర‌మ‌ని, క‌రోనా ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుకోవ‌డం ముఖ్య‌మ‌ని అంటూ చాలా చ‌ప్ప‌ని విమ‌ర్శ‌ల‌కు మాత్ర‌మే ప‌వ‌న్ ప‌రిమితం కావ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. ఆయ‌న రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ అంశంపై మెత‌క‌వైఖ‌రికి కార‌ణం భాజాపాతో మైత్రిగా ప‌లువురు విశ్లేషిస్తున్నారు. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ అంశంపై గ‌ట్టిగా వ్య‌తిరేక‌త ప్ర‌ద‌ర్శించాలి అంటే ఆ బిల్లుల‌ను ఆమోదించిన గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌ను త‌ప్పు బ‌ట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే త‌న మిత్ర‌ప‌క్ష‌మైన భాజాపా నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌ల్ని త‌ప్పు ప‌ట్టిన‌ట్టు అవుతంది. అందుకే ప‌వ‌న్ గ‌ట్టిగా ప్ర‌తిస్పందించ‌లేద‌ని అంటున్నారు. అయితే దీనిపై ఆయ‌న ఎక్కువ కాలం ఈ వైఖ‌రి కొన‌సాగించ‌లేర‌నేది వాస్త‌వం. ఈ నేప‌ధ్యంలోనే ఆదివారం జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ భేటీ కానుంది. ప్ర‌ధానంగా రాజ‌ధాని అంశంపై చ‌ర్చించి ఒక స్టాండ్ తీసుకోవ‌డ‌మే ఈ భేటీ ముఖ్యోధ్దేశ్య‌మ‌ని స‌మాచారం.