WHO Director General s opening remarks at the media briefing on COVID 19

కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ అంచనా వేశారు. వైరస్‌ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా సంస్థ అత్యవసర విభాగం మరోసారి సమావేశమైంది. ఈ సంద‌ర్భంగా ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. 18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు ఉన్న ఈ బృందం కరోనాపై సమీక్ష జరపడం ఇది నాలుగోసారి. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులు చేసింది.

తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేసింది. చైనా వెలుపల 100 కేసులు, అసలు మరణాలే లేని సమయంలో ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితి(పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌సర్న్‌-పీహెచ్‌ఈఐసీ) ప్రకటించాల్సి వచ్చిందని అధానోమ్‌ గుర్తుచేశారు. ఇలాంటివి వందేళ్ల‌కు  ఒకసారి వెలుగుచూస్తాయని.. ఆ త‌ర్వాత కూడా వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగ‌వ‌చ్చున‌ని తెలిపారు. అయితే, అత్యయిక స్థితిని ఇదే స్థాయిలో ఇంకా కొనసాగిస్తారా అన్న అంశంపై మాత్రం పూర్తి స్పష్టత రాలేదు. కరోనా విషయంలో శాస్త్రసంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని.. ఇంకా కొన్నింటికి సమాధానం దొరకాల్సి ఉందన్నారు. ఇంకా చాలా మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉందని.. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందన్నారు.

తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశాల్లో మరోసారి వైర‌స్‌ విజృంభిస్తోందని అధానోమ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తొలినాళ్లలో పెద్దగా ప్రభావానికి గురికాని దేశాలు సైతం ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కొన్ని దేశాలు మాత్రం వైరస్‌ను బాగా కట్టడి చేయగలిగాయన్నారు.