
కేంద్ర ప్రభుత్వం, ఇతర ఏజెన్సీల నుంచి రాష్ట్ర ఐటిఐలకు నిధులు రాబట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. ఉన్నతాధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి ప్రైవేట్ ఐటిఐల పై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఐటిఐలలో ఆక్యుపెన్సీని పెంచుకుని విద్యార్దుల ఉపాధి కల్పనకు కృషి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఉన్న ఐటిఐలకు సరిపడా బోధనా నైపుణ్యం అందిస్తున్న ఐటిఐలను అప్గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వాటిని స్థాపించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ పరిశీలనకు పంపాలని ఆదేశించారు. ఇండస్ర్టీస్ డిపార్ట్మెంట్తో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ ఐటిఐలను ఇండస్ర్టీస్ అడాప్ట్ చేసుకుంటే భావితరాల భవితకు బాటలు వేసినట్టవుతుందన్నారు. అలా అడాప్ట్ చేసుకున్న కంపెనీలు వారికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని, ముందుగా హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసి పరిదిలోని ప్రభుత్వ ఐటిఐలను గుర్తించి వాటి పూర్తి వివరాలను ఇండస్ర్టీస్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ప్రతిపాదనలుపంపాలని ఆదేశించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో నైపుణ్యం ఉన్నయువతను గుర్తించ వలసిన ఆవశ్యకత చాలా ఉందన్నారు. వారికి సంపూర్ణ శిక్షణ ఇప్పించే విధంగా ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ తరపున శిక్షన శిబిరాలు ఏర్పాటు అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు.