Foundation to be laid for AP CMs Office in Vizag on Aug 15 Dy CM Krishnadas

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం నేప‌ధ్యంలో విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. తాము కోరుకున్న‌ట్టుగా మూడు రాజధానులకు గవర్నర్ రాజముద్ర పడడంతో వైసీపీ సర్కారులో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. మ‌రోవైపు విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ఖాయమవడంతో ఉత్తరాంధ్ర నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేప‌ధ్యంలో ఇటీవలే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ పొందిన ధర్మాన కృష్ణదాస్ విశాఖ రాజధాని అంశంపై స్పందించారు. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు మంచి నిర్ణయం వెలువడిందన్నారాయ‌చ‌. విశాఖలో రాజధాని పనులకు బహుశా ఆగస్టు 15న శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని సూచ‌న‌ప్రాయంగా వెల్లడించారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ధర్మాన పేర్కొన్నారు. వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ అభివృద్ధి చెందేందుకు సహజసిద్ధంగా అనేక వనరులు ఉన్నాయని, ఈ విషయంలో టీడీపీ ఆరోపణలు సహేతుకం కాదని స్పష్టం చేశారు.