Ilayaraja lodges complaint against Prasad Studios

వీనుల విందైన పాట‌లంటే ఇళ‌య‌రాజా స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు. సంగీతం అంటే ఇళ‌య‌రాజా, ఇళ‌య‌రాజా అంటే సంగీతం. అత‌ని కంటే ముందు పాత‌త‌రంలో ఎన్నో అద్భుత‌మైన పాట‌లు, మ‌ర‌పురాని గీతాలు స్వ‌ర ప‌రిచిన గొప్ప సంగీత ద‌ర్శ‌కులు ఉన్నారు. ఆ త‌ర్వాత 1970 ద‌శ‌కంలో వ‌చ్చిన సంగీతం కాస్త భిన్నంగా ఉండేది. దాన్ని మార్చి ద‌క్షిణాది సినిమాల్లోని సంగీతానికి కొత్త ఒర‌వ‌డి తీసుకొచ్చిన ఘ‌న‌త ఖ‌చ్చితంగా ఇళ‌య‌రాజాకే ద‌క్కుతుంది. ఒక సంగీత ద‌ర్శ‌కుడికి ప్రాధాన్యం పెర‌గ‌డం, సినిమా పోస్ట‌ర్‌పై అత‌ని ఫోటోను ప్రింట్ చేయ‌డ‌మ‌నేది ఇళ‌య‌రాజాతోనే స్టార్ట్ అయింది. అయ‌న‌న్నా, ఆయ‌న సంగీతం అన్నా ఎంతో మందికి స్ఫూర్తి. కాలం మారుతుంది, అభిరుచుల్లో మార్పులు వ‌స్తాయి. అప్ప‌టివ‌ర‌కు వీనుల విందుగా అనిపించిన సంగీతం కొంత‌కాలానికి వెగ‌టుగా అనిపించ‌వ‌చ్చు, లేదా సంగీతంలో కొత్త మార్పులు రావ‌చ్చు. వీటిలో ఏది కార‌ణ‌మైనా ఇళ‌య‌రాజా మాత్రం సినిమాలు చేయ‌డంలో వెన‌క‌బ‌డ్డారు.

ఇప్పుడు సినిమాల‌కు సంగీతం చేయ‌డం కంటే వివాదాల ద్వారానే ఎక్కువ ప్ర‌చారం పొందుతున్నారు ఇళ‌య‌రాజా. త‌న మిత్రుడు, సోద‌రుడితో స‌మానం అనుకునే ఎస్‌.పి.బాలసుబ్ర‌హ్మ‌ణ్యం వివిధ కార్య‌క్ర‌మాల్లో త‌ను ట్యూన్ చేసిన పాట‌ల్ని పాడి సొమ్ము చేసుకుంటూ త‌న‌కు రాయ‌ల్టీ ఇవ్వ‌డం లేదంటూ కోర్టుకెక్కారు. తాజాగా ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డు సాయిప్ర‌సాద్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు ఇళ‌య‌రాజా. గత కొన్నేళ్లుగా ఇళ‌య‌రాజా, సాయి ప్రసాద్ మధ్య ఓ స్టూడియో విషయమై వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా ఇళయరాజాను సాయిప్ర‌సాద్ బెదిరించడంతో పాటు స్టూడియోలో ఇళయరాజా సూట్‌లో ఉన్న సంగీత వాయిద్య పరికరాలను ధ్వంసం చేసారని చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఇళయరాజా ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే సాయి ప్రసాద్ మనుషులు తన స్టూడియోను ఖాళీ చేసేలా దౌర్జన్యం చేసారని ఇళయరాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, తాను చేసుకునే ప‌నికి ఆటంకం క‌లిగిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి. ఇళ‌య‌రాజా సంగీతం అంటే ఇష్ట‌ప‌డ‌నివారు ఎవ‌రుంటారు. అలాగే ద‌ర్శ‌క‌నిర్మాత ఎల్‌.వి.ప్ర‌సాద్ కూడా అప్ప‌ట్లో ఇళ‌య‌రాజా సంగీతానికి ముగ్ధుడై ప్ర‌సాద్ స్టూడియోలోని ఓ సూట్‌ను ఆయ‌న‌కు బహుమానంగా ఇచ్చారు. అప్ప‌టి నుంచి త‌న సంగీత కార్య‌క్ర‌మాల‌న్నీ అక్క‌డే చేసుకుంటున్నారు ఇళ‌య‌రాజా. ఈ సూట్‌ను ఎల్‌.వి.ప్ర‌సాద్ బ‌హుమానంగా ఇచ్చారు అని చెప్ప‌డానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. కేవ‌లం నోటి మాట‌పైనే ఇచ్చారు. ఇరువురూ ఎలాంటి ప‌త్రాలు రాసుకోలేదు. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డు సాయిప్ర‌సాద్ ఆ సూట్‌ను సొంతం చేసుకోవాల‌ని అనుకున్నాడు. దానికోసం అన్ని రకాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ విష‌యమై ఇళ‌య‌రాజా కోర్టుకెక్కాడు. కేసు కోర్టులో ఉండ‌గానే సాయిప్ర‌సాద్ దౌర్జ‌న్యానికి పాల్ప‌డ‌డంతో మ‌రోసారి ఈ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు ఇళ‌య‌రాజా.