CM KCR Review Meeting on Water Allocation

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సమావేశంలో ఉమ్మడి అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొని ఉన్న జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పవలసిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ యు.పి.సింగ్ రాసిన లేఖపై ఇవాళ ప్రగతిభవన్ లో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బి.వినోద్ కుమార్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ సలహాదారు శ్రీ ఎస్.కె. జోషి, సీఎంఓ ఉన్నతాధికారులు శ్రీ నర్సింగ్ రావు, శ్రీమతి స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీ శ్రీధర్ దేశ్ పాండే, రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు శ్రీ మేరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, శ్రీ వెంకట రామారావు, శ్రీ రామకృష్ణారెడ్డి, శ్రీ దామోదర్ రెడ్డి, శ్రీ గోపాల్ రెడ్డి, సీఈలు శ్రీ నాగేందర్ రావు, శ్రీ నరసింహ, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది శ్రీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్న సమావేశం నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించింది.

కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఆగస్టు 5వ తేదీని నిర్ణయించింది. అయితే ఆ తేదీన ముందే నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలుండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందన్న భావన వ్యక్తమైంది. దీంతోపాటు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక ఆగస్టు 20 తదనంతరం సమావేశం ఉండేలా వేరే తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జల వనరులశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం సూచించింది.

ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉన్నదని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది.

కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సాంప్రదాయం ఉందని, అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.

ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్ కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ నెలకొని ఉన్న నేపథ్యంలో, పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్ కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టిన తీరును సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో కేంద్రం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తున్నదనీ, ఈ దుర్మార్గ వైఖరిని ఇకనైనా విడనాడాలని సమావేశం అభిప్రాయపడింది. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది.

ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా దగాపడ్డ మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించింది.

గోదావరీ, కృష్ణా జలాల్లో మన రాష్ట్రం వాటాను ఎట్టి పరిస్థితుల్లో సమగ్రంగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగాలని, సమావేశం బలంగా అభిప్రాయపడింది.