రివ్యూ : పవర్ లెస్ మూవీ ఆర్జీవీ 'పవర్ స్టార్'

Power Star Movie Reviw

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 1.5/5

నటీనటులు: పేర్లు తెలియదు సంగీతం : డీఎస్ఆర్ సినిమాటోగ్రఫీ : జోషి నిర్మాణ సంస్థ : ఆర్జీవీ వరల్డ్ థియేటర్ దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

విడుదల తేదీ : 25.07.2020 ఉదయం 11ఘంటల నుండి

రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ సమయంలో వరుసగా సినిమాలు తీస్తూ అందరికీ షాకుల మీదు షాకులిస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన వర్మ, తాజాగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో పవర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేశాడు. రిలీజ్ కు ముందు చూపించే టీజర్, ట్రయిలర్, సాంగ్స్ లో ఏముంటుందో అంతకుమించి సినిమాలో ఏం ఉండదనే మరోసారి పవర్ స్టార్ చిత్రం తో ప్రూవ్ చేసుకున్నాడు. అనేక వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

కథ :

ప్రవన్ కళ్యాణ్ అనే ఓ సినిమా స్టార్ మన సేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతాడు. పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోవడం, పార్టీకి ఒక్క సీటు రావడంతో ఫలితాలు వచ్చిన రాత్రి కుంగిపోతాడు. ఇక ప్రవన్ కళ్యాణ్‌ను ఆయన పెద్దన్న, చిన్నన్న, ఆప్త మిత్రుడు టీఎస్, భక్తుడు గుండ్ల రమేష్, బాబు వచ్చి మాట్లాడుతారు, ఓదార్చుతారు, తిడతారు. తన రాజకీయ భవిష్యత్ పై సందిగ్ధంలో పడతాడు. అసలు రాజకీయాలలో కొనసాగాలా, వదిలేయాలా అనే సందిగ్ధంలో ఉండగా, చివరగా తన తదుపరి కార్యాచరణ ఏంటో పాలుపోకుండా ఉన్న ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని వచ్చి సలహాలు, సూచనలు, హితబోధన చేస్తాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని తెలియాలంటే పవర్ స్టార్ చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు :

పవర్ స్టార్ సినిమా ప్రవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మిగతావన్నీ అతిథి పాత్రలే. అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. అయితే సినిమాలో చూపించే పాత్రలు నిజ జీవితంలో కొందరిని పోలి ఉంటుంది. మాట్లాడే విధానం, కనిపించే పద్దతిని బట్టి మనం కొందరి పోలికలు కనిపిస్తాయి. ఈ క్రమంలో టీఎస్, గుండ్ల రమేష్, కత్తి, ఆయన అన్నయ్య, బాబు, రష్యన్ భార్య వస్తారు. చివరగా వీరాభిమాని వచ్చి కనువిప్పు కలిగిస్తాడు. వారి పేర్లు తెలియవు కానీ ఆయా పాత్రల్లో అందరూ చక్కగా పేరడీ నటించారు. ఆర్ జి వి ఈ మూవీలో ఓ పాత్ర చేయడం విశేషం..ఆయన నటన పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

సాంకేతిక వర్గం పనితీరు:

కెమెరా పనితనం బాగుంది, కెమెరామెన్‌ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం రానట్టు కనిపిస్తోంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఇక ఈ సినిమా ద్వారా ఆర్ జి వి నేను పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కాదని నిరూపించుకొనే ప్రయత్నం చేశారు. సాంకేతిక నిపుణుల పనితం గురించి పవర్ స్టార్‌లో చెప్పుకోవాల్సినంతగా ఏమీ లేదు. ఉన్న ఒక్క గడ్డి తింటావా సాంగ్ సెటైరికల్‌గా బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్‌కు తగ్గట్టుంది. అంతా ఒకే చోట, ఒకే ఇంట్లో తీయడంతో నిర్మాణానికి కూడా ఎక్కువగా ఖర్చుకానట్టు తెలుస్తోంది.

విశ్లేషణ :

ఈ చిత్రం ద్వారా రామ్ గోపాల్ వర్మ హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాడని అందరూ అనుకున్నారు. ఐతే ఈ సినిమాలో అలాంటి పర్సనల్ అటాక్స్ ఏమి ఉండవు. ఎన్నిక ఫలితాల తరువాత ప్రవన్ కళ్యాణ్ అనే ఓ స్టార్ కమ్ పొలిటీషియన్ అనుభవించిన మానసిక వేదన తెలియజేశారు.ఇక ప్రవన్ కళ్యాణ్ పాత్ర చేసిన వ్యక్తి తనకు ఇచ్చిన జాబ్ పరి పూర్ణం చేశాడు. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా జనాల్లో ఓ హైప్‌ను తెచ్చి జనాలపైకి వదిలిన పవర్ స్టార్ సినిమాలో అతను ముందుగా వదిలిన టీజర్, ట్రైలర్, సాంగ్లలో చూపించిన దానికంటే ఇంతకుమించి ఏమీ లేదు. వెబ్ సిరీస్ లో కూడా కనీసం 56 నిమిషాల నిడివిగల ఎపిసోడ్స్ ఉంటాయి. సీరియల్ అయితే 30 నిముషాలు ఉంటాయి. ఈ సినిమా కేవలం నిజానికి 37 నిమిషాల నిడివితో వుండే దీన్ని సినిమా అనడం కంటే ఓ స్పూఫ్, సింగల్ ఎపిసోడ్ అనవచ్చు.

ఇక పవర్ స్టార్ లో సన్నివేశాల విషయ సూచిక ఈ విధంగా ఉంటుంది.

* ఫలితాల రోజు: ప్రవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ తో టీవీని పగలగొడతాడు.

* ఎన్నికల ప్రసంగాలు రాసిన దర్శకుడితో సంభాషణలు, ఫలితాల రోజు అతడ్ని లాగిపెట్టి చెంప దెబ్బ కొట్టడం.

* ప్రవన్ పెద్దన్నయ్య అతడికి హితవు చెప్పడం, తిరిగి సినిమాల్లోకి రమ్మని సలహా ఇవ్వడం.

* ప్రవన్ తో చిన్న అన్నయ్య ఫోన్ సంభాషణ * కత్తి మహేష్ ప్రవన్ ను ఇంటర్వ్యూ చేయడం

* భక్తుడు గుండ్ల రమేష్ అతి.

* చంద్రబాబుతో సమావేశం

* తన రష్యన్ భార్యతో ప్రవన్ సంభాషణలు.

* "గడ్డి తింటావా.." అనే లిరిక్స్ తో వచ్చే సాంగ్. ఇవన్నీ (టీజర్, ట్రైలర్ లో చూసినవే)

* చివర్లో రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ.. అతడి శైలిలో వికారమైన ఓ చెత్త తాత్విక ప్రవచనం ‘పవర్ స్టార్' సినిమా ఆర్జీవీ ఏదొ ఆటవిడుపుగా తీసినట్టున్నాడు. తన ఊహకు ఏది వస్తే అది తీసే వర్మ.. పవర్ స్టార్‌ను తీయడంలో ఆశ్చర్యమే లేదు. వర్మ తన ఊహలు, కల్పనలను బాగానే వాడుకున్నాడు. మంచి స్వభావం కలిగిన ప్రవన్ కళ్యాణ్ ని కొందరు తమ స్వార్ధం కోసం తప్పుదారి పట్టించారు అన్నట్లు సాగింది. ప్రముఖులపై వర్మ వేసిన కొన్ని సెటైర్స్ మరియు ప్రవన్ కళ్యాణ్ పాత్రను వర్మ స్వయంగా ఎదుర్కొనే విధానం వంటి విషయాలు చాలా మందికి నచ్చకపోవచ్చు. భిన్న షేడ్స్ కలిగిన ఈ మూవీ చూసే వారి దృష్టికోణాన్ని బట్టి అభిప్రాయం మారవచ్చు. ఐతే వర్మ గత చిత్రాలతో పోల్చుకుంటే మాత్రం పరవాలేదు అనిపిస్తుంది. ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని, నిజమైన అభిమాని ఉన్నాడని చెప్పడానికే ఈ చిత్రం తీశాడేమో.