
గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ సినిమాను శతవిధాలుగా ప్రమోట్ చేసేందుకు తిప్పలు పడుతున్న వర్మ... మరో ప్రయోగం చేశాడా? ఈ సినిమా లీక్ అంటూ బుధవారం కొత్త సినిమా చూపిస్తున్నాడా? అంటే ట్రేడ్ పండితులు కొందరు అవుననే అంటున్నారు.
పవన్ కళ్యాణ్ క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని వర్మ తీస్తున్న పవర్ స్టార్ సినిమా గత కొన్ని రోజులుగా మీడియాలో తగినంత ప్రచారానికి నోచుకుంటూనే ఉంది. ఓ రోజు పోస్టర్, ఓ రోజు సాంగ్... ఇలా దీని కోసం రోజుకో రకమైన రీతిలో పబ్లిసిటీ చేసుకుంటున్న వర్మ... ట్రైలర్‌కి రిలీజ్‌కి బుధవారం ముహూర్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ ట్రైలర్ చూడడానికి కూడా రూ.25 టిక్కెట్ నిర్ణయించి మరో సంచలనానికి తెర లేపాడు.
ఈ నేపధ్యంలో బుధవారం అకస్మాత్తుగా ఈ సినిమా ట్రైలర్ ఓ యూట్యూబ్ చానెల్లో ప్రత్యక్షమైంది. దీంతో అనుకోకుండా అనధికారికంగా ట్రైలర్ లీక్ అయింది కాబట్టి.. తాను ట్రైలర్ విడుదల చేయడం లేదని, దీని కోసం రూ.25 చెల్లించిన వారందరికీ డబ్బులు తిరిగి చెల్లించేస్తానని వర్మ బుధవారం ట్వీట్ చేశాడు. దీంతో ఈ నెల 22 అంటే బుధవారం విడుదల కావాల్సిన ట్రైలర్ విడుదల కాలేదు.
అయితే ఇదంతా వర్మ చేసిన గిమ్మిక్కు అంటున్నారు కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు. ట్రైలర్‌కు వర్మ ఆశించినంత స్పందన రాకపోవడంతో వర్మ ఈ లీక్ రూట్ ఎంచుకున్నాడని అంటున్నారు. తద్వారా మరో 2 రోజుల్లో విడుదల కానున్న పవర్‌స్టార్ సినిమాకు అవసరమైనంత హైప్ తేవడమే వర్మ లక్ష్యంగా సందేహిస్తున్నారు. అయితే దీన్ని వర్మ కొట్టిపడేస్తున్నారు. ట్రైలర్‌కి విపరీతమైన స్పందన వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా.. వర్మ సినిమా రిలీజ్ వరకే ఈ సొల్లు చర్చ అంతా అని ఆ తర్వాత అయ్యో ఈ సినిమా కోసం ఇంత టైమ్ వేస్ట్ చేశామా అనుకోవడం తప్పదని... తెలిసిన వారు మాత్రం ఈ సినిమా గోలని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.