రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం 12 నెలల పాటు అనుమతుల గడువు పెంపు

Real estate in Telangana

కరోనా ప్రభావం అన్నీరంగాలతోపాటు రియల్‍ ఎస్టేట్‍ రంగంపై కూడా పడింది. దాంతో చాలాచోట్ల రియల్‍ ఎస్టేట్‍ అభివృద్ధి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రియల్‍ ఎస్టేట్‍ రంగం అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం ఆ రంగానికి తగిన ప్రోత్సాహకాలను ప్రకటించింది. రియల్‍ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‍ నిర్మాణ రంగ అనుమతులు, లే అవుట్లకు ఆమోదం, మాస్టర్‍ప్లాన్‍, ఇసుక సరఫరాకు ఇబ్బందులు తొలగింపు, ప్రాజెక్టుల అనుమతి గడువు ఏడాది పాటు పెంపు, వంద ఫీట్ల అప్రోచ్‍ రోడ్డు, వాయిదాల పద్ధతి.. ఇలా అనేక సమస్యలను పరిష్కరించారు.

భవిష్యత్‍ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు లే అవుట్ల అనుమతుల నిబంధనలను కూడా ప్రభుత్వం సవరించింది. దీని ప్రకారం ఓపెన్‍ ప్లాట్లకు, గేటెడ్‍ కమ్యూనిటీ కాలనీకి అప్రోచ్‍ రోడ్డు వంద అడుగులు ఉండాల్సిందే..! ప్రస్తుతం ఓపెన్‍ ప్లాట్ల లే అవుట్లకు 30 అడుగులు, గేటెడ్‍ కమ్యూనిటీ కాలనీ లే అవుట్లకు 40 అడుగుల వరకు అప్రోచ్‍ రోడ్డు ఉండాలనే నిబంధనను మార్పు చేసింది. అంతేకాకుండా రోడ్డు వెడల్పు వంద అడుగుల లోపు నుంచి 80 అడుగుల వరకు ఉంటే డెవలప్‍మెంట్‍ చార్జీల్లో 50శాతం, 80 అడుగుల లోపు నుంచి 60 అడుగుల వరకు 66శాతం, 60 అడుగుల లోపు నుంచి 30 అడుగుల వరకు 100శాతం అదనపు రుసుం వసూలు చేస్తారు.

వచ్చే ఏడాది మార్చి 31వరకు గడువు

భవన / లే అవుట్‍ నిర్మాణ రంగ అనుమతుల పక్రియలో భాగంగా సర్కారు నిబంధనలకు అనుగుణంగా నిర్ణీతకాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. మల్టీస్టోరేజీ బిల్డింగ్‍ ప్రాజెక్టు గడువు పూర్తికి ఆరు సంవత్సరాలు, నాన్‍ ఎంఎస్‍బీలకు ఐదు సంవత్సరాలు, లే అవుట్లకు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్న నిబంధన ఉంది. ఆయా ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి చేయకుంటే మళ్లీ అనుమతికి క్లిష్టంగా ఉంటుంది. రెండేండ్ల చొప్పున సంబంధిత ప్రాజెక్టు పునర్మదింపు (రీ వాల్యూడేషన్‍)కింద అభివ•ద్ధిలో 20 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన ప్రాజెక్టులో విక్రయాలు జరిపితే రేరా నిబంధనల ప్రకారం భారీ జరిమానాలు, జైలు శిక్ష తప్పదు. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేయలేని పరిస్థితి. దీన్ని ద•ష్టిలో ఉంచుకుని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో ముగిసే అనుమతుల గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో డెవలపర్లకు ఉపశమనం లభించనున్నది. బ్యాంకు రుణాలు సులువుగా పొందే వీలు కలుగుతుంది. అంతేకాకుండా కార్మికుల ఉపాధి, కొనుగోలుదారులు సైతం సరైన సమయంలో ఫ్లాట్లను దక్కించుకోవచ్చు.

వాయిదా పద్ధతిలోనూ చెల్లించుకోవచ్చు

రియల్‍ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో లక్షలు, కోట్లల్లో జరిగే బిజినెస్‍ ఒక్కసారిగా లాక్‍డౌన్‍ వల్ల ఆగిపోవడంతో ఇన్వెస్టర్లు, డెవలపర్లకు ఏమి చేయాలోఅర్ధం కాలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం తెరపైకి వాయిదాల పద్ధతిలో సంబంధిత నిర్మాణ రంగ అనుమతుల ఫీజులు చెల్లించుకునే వెసులుబాటును కల్పించింది. తొలిసారిగా జీహెచ్‍ఎంసీలో వాయిదాల పద్ధతికి అవకాశం కల్పించింది. జీహెచ్‍ఎంసీ, హెచ్‍ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ రంగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వాయిదాల పద్ధతుల్లో సంబంధిత డెవలప్‍మెంట్‍ చార్జీలను చెల్లించుకోవచ్చు. రెండేండ్ల కాలవ్యవధిలో నాలుగు విడుతలుగా నిర్ణీత డెవలప్‍మెంట్‍ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి డెవలప్‍మెంట్‍ చార్జీ చెల్లించిన నిర్మాణరంగదారుడికి మొత్తం ఫీజులో 5శాతం తగ్గింపు లభించనున్నది. వాయిదాల పక్రియలో భాగంగా పోస్ట్ డేటెడ్‍ చెక్కులు ఇచ్చి అవి పాస్‍ చేయకపోతే దుర్వినియోగం చేసిన నిర్మాణదారుడిపై 12 శాతం అదనపు రుసుం భారం పడనున్నది.