Minister KTR speech in Mahabubnagar

కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‍ విఫలమయ్యారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‍ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‍నగర్‍ జిల్లాలో మంత్రి కేటీఆర్‍ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను పూర్తిగా ఎవరు నిర్మూలించారో ప్రపంచంలో, అలాగే దేశంలో ఒక్కరిని చూపించండి. ఎవరైనా నాయకుడు లేదా ఏదైనా ఒక ప్రభుత్వం గొప్పగా ఏ పనైనా చేసిందా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేత సాయం, మాట సాయం చేయాలే తప్ప విమర్శలు తగవు అన్నారు. కరోనా సంక్షోభవంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. 55 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్లు రైతుబంధు కింద అందించాం. పెన్షన్లూ ఇస్తున్నాం. ఏదైనా ఉంటే నిర్మాణాత్మక సూచన లివ్వండి... వాటిని కచ్చితంగా పాటిస్తామని తెలిపారు.

ప్రైవేట్‍ ఆస్పత్రులు కరోనా వైద్యానికి నిరాకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లిన వారు డబ్బులు కడతామన్న పడకలు లేవని వారిని వెళ్లగొడుతున్నాయని, ప్రైవేట్‍ రంగం తిరస్కరించినా కరోన రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సిబ్బందే అండగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి ఒక్క గాంధీ ఆస్పత్రిలో మాత్రమే చికిత్స అందుతున్నట్లు ప్రజలు అపోహలో ఉన్నారన్నారు. అది నిజం కాదని, వికేంద్రీకరణతో స్థానికంగా ఎక్కడికక్కడ కరోనా వైద్య సేవలందిస్తున్నామని సృష్టం చేశారు. దాదాపు అన్ని జిల్లాలకూ రాపిడ్‍ యాంటిజన్‍ కిట్లు సరఫరా చేశామని చెప్పిన మంత్రి కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించామన్నారు. 

కరోనా వైరస్‍ అనేది ఎవరికీ అతీతం కాదని ఇది ఎవరికైనా సోకవచ్చని మంత్రి సృష్టం చేశారు. రాజకీయ, సీని ప్రముఖులు కూడా వైరస్‍ బారిన పడ్డారన్నారు. ఇలాంటి విప్కతర పరిస్థితుల్లో కరోనా రోగుల సామాజిక వెలి వంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోవడం దారుణమన్నారు. కరోనా వైరస్‍ సోకిన 94 ఏళ్ల వృద్ధురాలు, 20 రోజుల పాప కూడా ఆరోగ్యంగా బయటపడినట్లు వివరించారు. వాక్సిన్లు వచ్చేంత వరకు జాగత్రగా ఉండాలని, కరోనాతో సహజీవనం తప్పదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 వేల మందికి కరోనా పాజిటివ్‍ వచ్చిందని, వారిలో 98 శాతం మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్తున్నారని చెప్పారు. కేవలం 2 శాతం మంది మాత్రమే చనిపోతున్నారన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కరోనా కేసుల్లో భారత్‍ మూడో స్థానంలో ఉంది. మరి దీనికి ప్రధాని మోదీ వైఫల్యమనుకోవాలా? అని ప్రశ్నించారు. కరోనా వ్యాక్సిన్‍ కోసం ఆరు ఫార్మా కంపెనీలు పని చేస్తుంటే వాటిలో భారత్‍ బయోటెక్‍, ఇండియన్‍ ఇమ్యునలాజికల్స్, జయలజికల్‍ ఇవాన్స్, శాంత బయోటెక్స్ కంపెనీలు హైదరాబాద్‍ కేంద్రంగా పని చేయడం మనం గర్వించదగ్గ విషయమన్నారు.