Union Minister G Kishan Reddy visits Hyderabads Gandhi Hospital

ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌పై న‌మ్మ‌కం పెర‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. క‌రోనా చికిత్స తీరుతెన్నులు ప‌రిశీలించేందుకు హైద‌రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిని ఆయ‌న ఆదివారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రజాప్రతినిధులు ఖ‌రీదైన కార్పొరేట్ వైద్యం చేయించుకోవ‌డం స‌రైంది కాద‌ని, వారు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని సూచించారు.

ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా కేసులు నమోదవుతున్నాయని అన్నారాయ‌న‌. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయన్నారు.తెలంగాణలో పరిస్థితులపై మంత్రి ఈటల, ఆధికారులతో మాట్లాడానన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు 600వెంటిలేటర్లు పంపించామ‌ని అయితే గాంధీ ఆసుపత్రిలో 250పైగా వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయన్నారు. క‌రోనా చికిత్స బిల్లుల వ‌సూలు విష‌యంలో ప్రైవేటు ఆసుప‌త్రుల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులను కట్టడి చేయాల్సన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అదే స‌మ‌యంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం‌ కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేశారు. గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని కూడా ఆయ‌న‌ కోరారు.