Ravi Teja s Krack to release directly in OTT

చిత్ర ప‌రిశ్ర‌మ 2020 సంవ‌త్స‌రాన్ని ఇక మ‌ర‌చిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్ప‌ట్లో థియేట‌ర్లు ఓపెన్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఒక‌వేళ ధైర్యం చేసి థియేట‌ర్ల‌కు అనుమ‌తి ఇచ్చినా జ‌నం ధైర్యం చేసి థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అందుకే ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఓటీటీల‌నే న‌మ్ముకున్నారు. ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే ఆ నిర్మాత ఎంతో న‌ష్టాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఓటీటీ నిర్మాత‌ల పాలిట వ‌రంలా క‌నిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్, అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న నిశ్శబ్దం సినిమాలు ఓటీటీలో విడుద‌లయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే తెలుగులో అమృతరామమ్, ఆ తర్వాత కీర్తి సురేష్ పెంగ్విన్, తాజాగా కృష్ణ అండ్ హిజ్ లీలా, బానుమతి అండ్ రామకృష్ణ విడుదలై పరువాలేదనిపించాయి. అయితే ఇప్పటి వరకు ఓటీటీలో అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. బడా హీరోల సినిమాలు లేకుండానే చిన్న సినిమాలకు పరిమితమైంది ఓటీటీ. ఈ నేపథ్యంలో తెలుగులో తొలి ఓటీటీ బడా మూవీగా రవితేజ `క్రాక్‌` విడుద‌ల కాబోతోంది. రవితేజ శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తోంది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు కొన్ని ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరిపాడని.. అంతేకాదు ఓ సంస్థతో ఒప్పందం కుదిరినట్టు టాక్ వినిపిస్తోంది.