Minister KTR participated in USIBC Investment webinar

పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ స్వర్గధామమని, ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ ఇక్కడ అద్భుత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‍ పేర్కొన్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తూ పెట్టుబడులకు సంపూర్ణ భరోసా కల్పిస్తోందని తెలిపారు. దృశ్యమాధ్యమంలో జరిగిన అమెరికా, భారత్‍ వాణిజ్య మండలి (యూఎస్‍ఐబీసీ) అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఆయన ప్రగతి భవన్‍ నుంచి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ఆదారపడుతున్నాయని, ఐటీ సంస్థలు అమెరికా తర్వాత అతిపెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‍లోనే ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు.

దేశంలో పెట్టుబడులకు ముందుకొచ్చే విదేశీ సంస్థలు భారత్‍ను ఒక యూనిట్‍గా కాకుండా తెలంగాణలాంటి ప్రగతిశీల రాష్ట్రానికి యూనిట్‍గా తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ దేశంలోని అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. సరళతర వ్యాపార నిర్వహణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్‍ఐపాస్‍) విజయవంతంగా కొనసాగుతోంది. అనుమతులు పొందిన కొత్త పరిశ్రమల్లో 80 శాతానికి పైగా కార్యకలాపాలను ప్రారంభించాయి. ఔషధ, జీవశాస్త్రాలు, ఐటీ, జౌళి, వైమానికి, రక్షణ వంటి 14 ప్రాధాన్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వ గుర్తించి, పెట్టుబడులను పెద్దఎత్తున సమీకరిస్తోంది అని తెలిపారు.