https://www. Ram Gopal Varma s'Power Star' stills have left Twitterati

సంచ‌ల‌నాల‌కు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నానంటూ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని పోలిన న‌టుడి వీడియో ఒకటి ఆమ‌ధ్య రిలీజ్ చేశాడు. ఆ త‌ర్వాత ఆ న‌టుడు ప‌వ‌ర్‌స్టార్ సినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ న‌టుడితో ఫోటో షూట్ చేయించి ఆ స్టిల్స్‌ను వ‌దిలాడు వ‌ర్మ‌. ఆ స్టిల్స్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌వేనా అన్నంత‌గా కుదిరాయి. ఈ సినిమా ఎవ‌రినీ ఉద్దేశించి తీస్తున్న‌ది కాద‌ని వ‌ర్మ చెప్పిన‌ప్ప‌టికీ స్టిల్స్ చూసిన ఎవ‌రికైనా ఇది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొనే తీస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. అయితే సినిమాలో ఏయే అంశాలు ప్ర‌స్తావిస్తాడు? ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా జీవితం గురించా? వ‌్య‌క్తిగ‌త జీవితం గురించా? రాజ‌కీయ జీవితం గురించా?.. ఇలా అనేక ప్ర‌శ్న‌లు అభిమానుల మ‌న‌సుల్లో మెదులుతున్నాయి. మ‌రి వ‌ర్మ ఈ సినిమాతో ఎవ‌రిని సంతృప్తి ప‌రుస్తాడో, ఎవ‌రిని హ‌ర్ట్ చేస్తాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు ఆగాల్సిందే.

కేవ‌లం ఓటీటీలోనే త‌న సినిమాలు రిలీజ్ చేసే ఉద్దేశంతో వ‌ర్మ నాన్‌స్టాప్‌గా సినిమాలు చేసేస్తున్నాడు. అందులో భాగంగానే క‌రోనా వైర‌స్‌, క్లైమాక్స్‌, నేక్‌డ్ వంటి సినిమాల‌ను రూపొందించాడు. ప్ర‌స్తుతం మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నాడు వ‌ర్మ‌. ఈ సినిమా దాదాపుగా పూర్తి కావ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ సినిమాపై వివాదాలు రేగుతున్న నేప‌థ్యంలో చాలా ఫాస్ట్‌గా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసెయ్య‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు వ‌ర్మ‌. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ప‌వ‌ర్‌స్టార్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్తాడ‌ట‌. ర‌క్త‌చ‌రిత్ర‌, వంగ‌వీటి, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వంటి ప‌లు సినిమాలు రూపొందించి అన్నివ‌ర్గాల వారితో పేచీ పెట్టుకున్న వ‌ర్మ ఈసారి `ప‌వ‌ర్‌స్టార్‌`తో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో, ఎలాంటి వివాదాల‌కు తెర‌తీస్తాడో చూడాలి.