సుశాంత్ సింగ్ రాజపుత్ 'దిల్ బేచారా' ట్రైలర్ సెన్సేషనల్ రికార్డు

Dil Bechara Is The Most Liked Trailer Ever in 24 Hours Beating Avengers Endgame

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అతను నటించిన ఆఖరి చిత్రం దిల్ బేచారా ప్రపంచ సినిమా రంగంలో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ట్రైలర్‌కు సంబంధించిన లైక్స్ విషయంలో ఇప్పటి వరకు ఏ సినిమా లభించనన్నీ లైక్స్ దిల్ బేచారా ట్రైలర్ లభించడం ఓ అరుదైన ఘనతగా బాలీవుడ్ భావిస్తోంది. సుశాంత్ సింగ్ చివరి చిత్రం కావడంతో అభిమానులు, సినీ ప్రేక్షకుల భావోద్వేగంగా స్పందిస్తున్నారు. ఆ సినిమా ట్రైలర్ రికార్డుల గురించి వివరాలు ఇలా ఉన్నాయి…

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజనా సంఘీ జంటగా నటించిన దిల్ బేచారా చిత్రం జూలై 24వ తేదీన డిస్నీ+హాట్ స్టార్ వేదికగా ఓటీటీలో ప్రసారం చేయాలని దర్శకుడు ముఖేష్ చాబ్రా, నిర్మాత ఫాక్స్ స్టార్ ప్రతినిథులు నిర్ణయించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దిల్ బేచారా చిత్రం ట్రైలర్‌ను సోమవారం జూలై 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు అప్లోడ్ చేసింది ఫాక్స్ స్టార్ హిందీ. అయితే దిల్ బేచారా సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అనూహ్యమైన స్పందన లభించింది. జూన్ 8 మధ్యాహ్నం 2 ఘంటలకు ఏ సినిమా ట్రైలర్‌కు రానటువంటి లైక్స్ దిల్ బేచారాకు కేవలం 46 గంటల్లోనే రావడం విశేషంగా మారింది. గతంలో అంటే గతేడాది మార్చిలో రిలీజైన అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా ట్రైలర్‌కు 24 గంటలలో అత్యధికంగా అంటే 2.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు అదే అత్యధికంగా లైక్స్ సాధించిన ట్రైలర్‌ అనే రికార్డు ఎండ్‌గేమ్‌పై ఉంది. ఇక దిల్ బేచారా విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ గత 46 గంటలకు సమయంలో 7.9 మిలియన్ల లైక్స్ సాధించడం ఓ రికార్డుగా నిలిచింది. ఇక 32కె అన్‌లైక్స్ నమోదు అయ్యాయి. జూలై 8వ తేదీ మధ్యాహ్నం 2 వరకు ఈ ట్రైలర్‌కు 44,182,000 వ్యూస్ లభించడం గమనార్హం. సుశాంత్‌పై ఉన్న సానుభూతి చేతనో లేదా ఆయనపై అభిమానం ఉన్న కారణంగానో దిల్ బేచారా ఎవరూ తిరగరాయలేని రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.

ఎండ్ ‌గేమ్ రికార్డును బ్రేక్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూవీ దిల్ బేచారా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమా జీరో రికార్డును అధిగమించలేకపోయింది. యూట్యూబ్‌లో జీరో చిత్రం 24 గంటల్లో 50 మిలియన్ల వ్యూస్ సాధించగా, సుశాంత్ దిల్ బేచారా ఆ రికార్డును అందుకోలేకపోయింది. కాకపోతే అక్షయ్ కుమార్ నటించిన గుడ్ న్యూస్ సాధించిన 20 మిలియన్లు వ్యూస్, ప్రభాస్ సాహో సాధించిన 31 మిలియన్ల వ్యూస్‌ను యూట్యూబ్‌లో అధిగమించడం విశేషం.

ప్రముఖ రచయిత జాన్ గ్రీన్ రాసిన ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే పుస్తకం ఆధారంగా దిల్ బేచారా సినిమా తెరకెక్కింది. కైజీ, మన్నీ అనే ఇద్దరు సాధారణ యువతీ, యువకుల మధ్య చోటుచేసుకొన్న ఎక్ట్రార్డినరీ ప్రేమకథగా రూపొందుతున్నది. వారి జీవితాల్లో రెండు విషాదా సంఘటనలు ఉన్నాయి. అయినా వారు తమ జీవితాన్ని ఫన్నీగా, థ్రిల్లింగ్‌గా గడపడం అనేది కథలో బలమైన పాయింట్‌గా కనిపించింది. ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీతం దర్శకత్వం వహించారు.