https CM YS Jagan Review Meeting on Spandana Program

క‌రోనా నియంత్ర‌ణ విష‌యంలో ఆంధ్ర‌ప్రదేశ్ గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో విజ‌య‌వంత‌మైంద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్నారు. మంగ‌ళ‌వారం చేప‌ట్టిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ రెండు మూడు టెస్టులు కూడా చేయడానికి ఇబ్బందే పరిస్థితి మారిపోయి సగటున రోజుకు 22–25వేల టెస్టులు చేయగలుగుతున్నామని, ఇప్పటివరకూ 10లక్షలకుపైగా టెస్టులు చేయగలిగామ‌ని గుర్తు చేశారు. ఈ ఘ‌న‌త‌కు కార‌ణ‌మైన అధికారులకు, కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే...

ఇంట్లోనే చికిత్స‌...

క‌రోనా పాజిటివ్ కేసుల విష‌యంలో హోం ఐసోలేషన్‌ అన్నది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది .ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తే 85శాతం కేసులకు ఇంట్లోనే నయం అవుతుందనేది అర్ధ‌మ‌వుతుంది. హోం ఐసోలేషన్‌కు రిఫర్‌ చేసే వారిని బాగా చూసుకుంటున్నామా? లేదా? మందులు సరిగ్గా అందుతున్నాయా? లేదా? గ‌మ‌నిస్తూ ఉండాల‌న్నారు. గ్రామ సచివాలయంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్, ఆశావర్కర్, ఏఎన్‌ఎం, అలాగే జిల్లా స్థాయిలో ఉన్న కోవిడ్‌ కంట్రోల్‌ రూంలు బాగా పనిచేయాలి. హోం ఐసోలేషన్‌మీద కలెక్టర్లు కూడా ప్ర‌త్యేక‌ దృష్టిపెట్టాలి. హోం ఐసోలేషన్‌కోసం ఇండివిడ్యువల్‌గా ఇంట్లో ప్రత్యేక గది లేని వారికోసం కేటాయించాలి.

కోవిడ్‌కేర్‌ సెంటర్లలో నాణ్య‌మైన సేవ‌లు..

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించాలి. వారికిచ్చే ఆహారం, బాత్‌రూం, త‌దిత‌ర వ‌స‌తుల మీద బాగా దృష్టిపెట్టాలి: వైద్యుల పర్యవేక్షణ బాగుందా లేదా? అలాగే మందులు ఇస్తున్నారా? లేదా? ఆ మందులను కూడా జీఎంపీ ప్రమాణాలు ఉన్నవి ఇస్తున్నారా? లేదా? అన్నయ అంశాల‌ను కలెక్టర్లు ప‌రిశీలించాలి. అలాగే రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు, జిల్లాల్లోని కోవిడ్‌ఆస్పత్రుల్లో నాణ్య‌మైన వ‌స‌తులుండాలి. బెడ్లు, బాత్‌రూమ్స్, మెడికేషన్, ఆహారం ఈ నాలుగు అంశాల మీద అధికారులు దృష్టిపెట్టాలి. అలాగే అనుమానితులకోసం అందించే క్వారంటైన్‌ సదుపాయాలు కూడా బాగుండాలి.

వ్యాక్సినొచ్చేవ‌ర‌కూ..క‌లిసే బ్ర‌తుకు...

దేశంలో అన్ని రాష్ట్రాల సరిహద్దులు తెరవ‌డం, కొన్ని అంతర్జాతీయ విమానాలు కూడా రాక‌పోక‌లు సాగిస్తున్నాయి కాబ‌ట్టి సహజంగానే కేసులు పెరుగుతాయి. అయితే అంతమాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు.వ్యాక్సిన్‌ కనుగొనేంత వరకూ... క‌రోనా తో క‌లిసి బ‌త‌కాల్సిందే. కాక‌పోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాని, కేసులు ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగిపోయి వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.

కోవిడ్‌సోకితే , కోవిడ్‌ ఉన్నట్టుగా అనిపిస్తే.. ఒక వ్యక్తి ఎవరికి కాల్‌ చేయాలి? ఏం చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? అన్నదానిపై స్ప‌ష్ట‌త ఉండాలి. ప్రజలందరికీ కూడా ఈ మూడు విషయాలూ తెలిస్తే దీనివల్ల ప్రజలు వైద్యం చేయించుకోవడం సులభం అవుతుంది. కాబ‌ట్టి ప్రజల్లో చైతన్యం కలిగించడంమీద దృష్టిపెట్టాలి. మనం సహాయం కోసం ఇచ్చే కాల్‌ సెంటర్‌ నంబర్లు , టెలిమెడిసిన్‌ నంబర్లు నిర్విరామంగా సేవ‌లు అందించాలి. ఈ యంత్రాంగం సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపై డమ్మీ చెకప్స్‌కూడా చేయండి. ఎప్ప‌టిక‌ప్పుడు పనితీరును కూడా సమీక్ష చేసుకుని.. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి.