Demolition of old Telangana Secretariat complex begins

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పక్రియ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్‍ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుత భవనాల్ని కూల్చివేసేందుకు గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం కొత్త భవనం నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం సీ బ్లాక్‍ను భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు.

రాష్ట్ర సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్న నేపథ్యంలో సచివాలయం వైపు వాహనాలు రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. సచివాలయ ప్రాంగణానికి అర కి.మీ. చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. దారులన్నీ మూసివేశారు. ఖైరతాబాద్‍, రవీంద్రభారతి, హిమయత్‍నగర్‍ కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పొరపాటున సచివాలయం వైపు వచ్చిన వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లిస్తున్నారు. కూల్చివేత పనులను సిఎస్‍, డీజీపి, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.