KTR meets  with construction industry at pragati bhavan

హైదరాబాద్‍ అద్భుత ప్రగతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో నిర్మాణ రంగం భాగస్వామి కావాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. నగరంలో చెరువులు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలను పారవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతిభవన్‍లో నిర్మాణ రంగానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ఉపశమన చర్యలు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు ఆమోదం వంటి అంశాలను మంత్రి దృష్టికి తెచ్చారు.

వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాం. ముఖ్యమంత్రి కేసీఆర్‍ నేరుగా ఈ రంగంలోని ప్రతినిధులతో గతంలో సమావేశమై మద్దతునిచ్చారు. దీనికి అనుగుణంగా నిర్మాణ రంగానికి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తాను. ప్రభుత్వం నిర్మాణ సంస్థలు ఇచ్చిన భరోసా వల్లనే చాలా మంది కార్మికులు తిరిగి హైదరాబాద్‍లో పనిచేసేందుకు వస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ స్థలాల్లో పనిచేస్తున్న అతిథి కార్మికుల వివరాలను క్రోడీకరించి మాకు అందజేస్తే వారికి నిత్యావసర సరకుల పంపిణీ సులభమవుతుంది అని కేటీఆర్‍ తెలిపారు.