chandrababu-naidu-vows-fight-amaravati-capital-protests-complete-200-days

నవ్యాధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా తెలుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతికి ప్రాచీన చరిత్ర ఉందని, అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలన్నారు. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవడం మనం చేసిన తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదని సృష్టం చేశారు. 13 జిల్లాల నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టామని గుర్తు చేశారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‍భవన్‍ కట్టాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ 72శాతం నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే పనిచేయవచ్చన్నారు.

అమరావతి కోసం రూ.9వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు 139 సంస్థలు ముందుకొచ్చాయని, కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో మానవ హక్కులు ఉల్లంఘించారని విమర్శించారు. రాజధాని ప్రాంతాల రైతులను ఎంతో హింసించారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమం కొనసాగిస్తున్న రైతులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఢీల్లీ కంటే దీటైన నగరం కట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‍ ఆవరణలోని మట్టి, యమునానది జలాలను తీసుకొచ్చి అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. అమరావతి స్థలబలం చాలా గొప్పది. దీనికి తోడు సంకల్ప బలం కూడా ఉందని అన్నారు. అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైన కూడా ఉందన్నారు. సేవ్‍ అమరావతి, సేవ్‍ ఆంధప్రదేశ్‍ నినాదం కొనసాగించాలని పిలుపునిచ్చారు.