రివ్యూ : 'భానుమతి అండ్ రామకృష్ణ'లు మెప్పించారు

bhanumathi and ramakrishna movie review

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్: 3/5

బ్యానర్: నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఓ టి టి వేదిక: ఆహ
తారాగణం: నవీన్ చంద్ర, సలోని లూత్రా, 'వైవా' హర్ష చెముడు, రాజా చేంబోలు తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కూర్పు: రవికాంత్ పేరేపు, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి
విడుదల తేదీ: జులై 3, 2020

హోమ్ ఫ్రొం వర్క్, మనకు మనమే విధించుకున్న లాక్ డౌన్ పీరియడ్ లో ఓటిటి పుణ్యమా అని సినీ ప్రియులకు కొత్త సినిమాల కొరత తీరింది . తాజాగా నవీన్ చంద్ర, సలోని లూత్రా నటించిన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ చిత్రం ఈ రోజు విడుదలయింది. ఇటీవల విడుదలయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ కాలేజ్ కుర్రాళ్లను, పాతికేళ్ల లోపు యువతని ఆకట్టుకుంటే... ఈ ప్రేమకథ కాస్త మెచ్యూర్డ్ వర్గాన్ని టార్గెట్ చేసింది. శేఖర్ కమ్ముల స్కూల్‌ని గుర్తు చేసే శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు, సంఘటనలు చాలా వరకు పరిణతి వున్న ప్రేమజంట భావోద్వేగాలు, వారికుండే తర్జనభర్జనలు, అన్నిటికీ మించి వారి ఎమోషన్స్‌ని డామినేట్ చేసే స్వతంత్రపు స్వభావాలు, ఈగోలు... ఇతర ఇతర అంశాలు వున్నాయి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం తెలుగువారి ఓ టి టి వేదిక 'ఆహా' లో నెలవై వుంది

కథ:

ముప్పయ్యేళ్లకి ఇంకా పెళ్లి కాని భానుమతి(సలోని లూత్రా)కి బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ డీల్ చేస్తున్న సమయంలో ఆమెకి అసిస్టెంట్‌గా వస్తాడు రామకృష్ణ (నవీన్ చంద్ర) భానుమతి ఎంతో మోడరన్ గర్ల్, హై క్లాస్ మాటకారి, ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన రామకృష్ణ దానికి పూర్తి విరుద్ధం. రామకృష్ణకి ఇంగ్లీష్ రాదు, ముప్పయ్ మూడేళ్లొచ్చినా పెళ్లి కాలేదు. పెళ్లి విషయంలో ఇద్దరి సిట్యువేషన్ ఒకటే అయినా కానీ మిగిలిన అన్ని విషయాల్లో భిన్న ధృవాలు. వాటి మధ్యే ఆకర్షణ ప్రకృతి సహజం కనుక ఇద్దరూ ఒకరిపట్ల ఆకర్షితులౌతారు. అయితే ఇలాంటి ఆపోజిట్ పోల్స్ కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి పలు సందేహాలు, సందిగ్ధాలు, అపోహలు వగైరా వగైరా అడ్డు పడతాయి మరి ఇవన్నీ దాటుకుని వాళ్లిదరు ఎలా ఒక్కటవుతారనేది భానుమతి మరియు రామకృష్ణల కథ.

నటి నటుల హావభావాలు:

ఈ కథకు వీరిద్దరే యాప్ట్ అనే విధంగా నవీన్ చంద్ర, సలోని లూత్రా నటించి మెప్పించారు. కాస్త ఎక్కువ చేస్తే అతి చేస్తున్నట్టు, కాస్త తగ్గిస్తే మరీ తింగరిమేళంలా అనిపించేట్టు వున్న పాత్రని బ్యాలెన్స్ పోకుండా బాగా పర్‌ఫార్మ్ చేసాడు నవీన్ చంద్ర. శేఖర్ కమ్ముల చిత్రంలోని హీరోయిన్ మాదిరి లక్షణాలున్న పాత్రలో సలోని లూత్రాకి అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది కానీ నెమ్మదిగా ఆకర్షిస్తుంది. ఆమె అభినయంతో ఆకట్టుకుంటుంది. డబ్బింగ్ చెప్పిన వారికి సగం క్రెడిట్ ఇచ్చేయాలి అంతబాగా డబ్బింగ్ కుదిరింది. వైవా హర్ష మంచి టైమింగ్, ఎక్స్‌ప్రెషన్ వున్న ఆర్టిస్ట్ అయినా కానీ తగినంతగా అతడిని వినియోగించుకోలేధనిపించింది. చిన్న చిన్న సన్నివేశాల్లో తన మార్కు హాస్యంతో ఈ చిత్రాన్ని హర్ష పలుమార్లు నిలబెట్టాడని చెప్పొచ్చు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఓన్లీ అండ్ ఓన్లీ గా దర్శకుడు శ్రీకాంత్ నాగోతి గురించి చెప్పాలంటే… ఓ చిన్న కథను ఆసక్తికరంగా నడిపిన తీరు బాగుంది. ఆయన రాసుకున్న కథనం మరియు సన్నివేశాలు చాలా సహజంగా మనసుకు హత్తుకునేలా సాగాయి. కమర్షియల్ అంశాల కోసం…అవసరం లేని హంగులు జోడించ కూడా తెరకెక్కించి మెప్పించారు. హీరోయిన్ పాత్రతో పాటు హీరో పాత్రకు మరికొంత ప్రాధాన్యత…వారి పాత్రల మధ్య కాస్త సంఘర్షణ జోడించి ఉంటే మరింత ఆకర్షణగా ఉండేది. పాటలు పర్వాలేదనట్లున్నా బీజీఎమ్ మాత్రం అద్బుతంగా కుదిరింది. ఎడిటింగ్ బాగుంది. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ వారి ఉన్నత నిర్మాణ విలువలు కలిగిన ఈ చిత్రంలో కెమెరా వర్క్ మెప్పిస్తుంది. ఇక నిగూఢమైన అర్ధాలతో వచ్చే సంభాషణలు కూడా సున్నితంగా వున్నాయి.

విశ్లేషణ:

ఓ ప్రేమ కథలో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ ఫీల్ గుడ్ మూవీగా సాగే ఈ మూవీపై ఎక్కడా విసుగన్న భావన రాదు. ప్రధాన పాత్రల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, సంభాషణలకు తోడు…కట్టిపడేసే కథనం మంచి అనుభూతిని పంచుతుంది. సున్నితమైన సన్నివేశాలకు బీజీమ్ మరింత ఆకర్షణ జోడించింది. ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేడీగా సలోని నటన చాలా సహజంగా ఉంది. చిన్న సినిమాగా తీసారు కనుక సాంకేతికంగా వనరులు గొప్పవి లేవు. అయితే స్క్రిప్ట్, డైలాగ్స్ పరంగా తగినంత కేర్ తీసుకున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు శ్రీకాంత్‌కి చిన్న చిన్న ఎమోషన్స్‌ని స్ట్రయికింగ్‌గా చెప్పే సామర్ధ్యం ఉంది. ఆ ఎమోషనల్ డైలెమాని చాలా బాగా తెరెకక్కించాడు. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటిటి ప్లాట్‌ఫామ్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ మెప్పించే మెటీరియల్ కాదు కనుక టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవడానికి ఈ వేదిక ఉపకరిస్తుంది. 30 ప్లస్ వున్నవారు రిలేట్ చేసుకునే పాత్రలు, సహజమైన సన్నివేశాలు, ఆహ్లాదం కలిగించే సంభాషణలు వున్నాయి ఒక సదా సీదా కథలని కూడా వినోదాత్మకంగా, జనరంజకంగా చెప్పవచ్చునని ఈ చిత్రం మరోసారి నిరూపిస్తుంది.మనకు మనమే విధించుకున్న లాక్ డౌన్ సమయంలో ఆహ్లాదం పంచే ఈ భానుమతి అండ్ రామకృష్ణ మూవీని తప్పక చూడండి.