ambulance-project-cm-jagans-rs-307-crore-birthday-gift-to-vijayasai-alleges-chandrababu

కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మేలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా అనేది ప్రపంచానికే పెద్ద సమస్యగా మారిందన్న చంద్రబాబు, సమస్యను ఎలా ఎదుర్కొని ముందుకెళ్లాలో ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజల జీవితాల్లో చాలా సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. లాక్‍డౌన్‍ పెట్టిన తర్వాత ఏపీకి రూ.8 వేల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‍ చెప్పారు. అ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదు. ప్రతి కుటుంబానికి కనీసం రూ.5వేలు చొప్పున ఇవ్వాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు.

కరోనా కిట్లు, బీచింగ్‍ కొనుగోలులో అవీనితికి పాల్పడ్డారు. 108, 104 వాహనాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకగా రూ.307 కోట్లు కట్టబెట్టారు అని ఆరోపించారు. అనుభవం ఉన్న సంస్థను పక్కనబెట్టి విజయసాయిరెడ్డి వియ్యంకుడికి 108 అంబులెన్స్ల నిర్వహణ కాంట్రాక్ట్ కట్టబెట్టారని పేర్కొన్నారు. కరోనాకు సంబంధించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి పబ్లిసిటీతో మనుగడ సాధించాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే తమపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.