Trump suspends H1B visas green cards till year end

ఇమ్మిగ్రేషన్‍ అటార్నీలు ఏమంటున్నారు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఎన్నికల సమయంలో మరోసారి వీసా బాణం విసిరారు. కోవిడ్‍ 19 వైరస్‍తో పడిపోయిన పాపులారిటీని తిరిగి చేజిక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న ట్రంప్‍, అనుకోకుండా జరిగిన జార్జ్ ఫ్లాయిడ్‍ మృతి తరువాత జరిగిన గొడవల సమయంలో ట్రంప్‍ అనుసరించిన వైఖరి తెల్లజాతీయులైన అమెరికన్లకు నచ్చింది. అయితే ఇంకా కొన్నిచోట్ల ఎదురవుతున్న వ్యతిరేకతను చల్లబరిచే విధానంలో భాగంగా ప్రధానమైన వీసా బాణాన్ని మరోసారి విసిరారు. అధ్యక్ష ఎన్నికల సమయం, మరోవైపు కోవిడ్‍ 19 వైరస్‍ కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకోవడానికి వీలుగా ఇక్కడి అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ, విదేశీయుల రాకను నిరోధిస్తూ వీసా రద్దుపై ఎగ్జిక్యూటివ్‍ ఉత్తర్వులను వెలువరించారు.

ట్రంప్‍ విధించిన నిషేధపు ఉత్తర్వుల వల్ల అమెరికన్లకే మరిన్ని ఉద్యోగాలు వస్తాయా లేక తగిన నిపుణులు లేక అమెరికా నష్టపోతుందని కార్పొరేట్‍ వర్గాలు చెప్పినట్లు జరుగుతుందా అన్నది వేచి చూడాల్సిందే. కాగా, ఈ నిర్ణయం ట్రంప్‍ కు రాజకీయంగా ఉపయోగపడుతుందా లేదా అన్నది కూడా ఎన్నికల వరకు వేచి చూడాల్సి ఉంది. ట్రంప్‍ మాత్రం ఈ నిర్ణయంతోనే తాను గెలవచ్చునని భావిస్తున్నారు. పడిపోయిన ప్రతిష్ఠను ఇది నిలుపుతుందని అనుకుంటున్నారు.

రెండు నెలల క్రితం ప్రెసిడెంట్‍ ట్రంప్‍ హఠాత్తు గా వీసా ల ఆపివేతను తెర మీదకి తీసుకు వచ్చారు. అయితే అప్పుడు కూడా కొన్ని నిరసనలు రావటంతో ఆ ఆపివేత తీర్మానాన్ని రెండు నెలలు మాత్రమే అని తెలిపారు. ఆ వీసాల ఆపివేత ఈ జూన్‍ నెలాఖరుతో ముగిస్తుంది కాబట్టి మరొక ఎగ్జిక్యూటివ్‍ తీర్మానం ద్వారా 24 జూన్‍ నుంచి 31 డిసెంబర్‍ 2020 వరకు అన్ని రకాల వీసాలను ఆపివేస్తున్నట్టు ప్రకటించారు.

అమెరికా పౌరసత్వం...వీసాల విధానం

అమెరికాలో పౌరసత్వం, వీసా కావాలంటే అందుకు తగిన అర్హతలు ఉండాలి. వలస, జాతీయతా చట్టం (ఐఎన్‍ఏ)లో అమెరికా కాంగ్రెస్‍ నిర్దేశించిన నిబంధనలు వర్తించేవారు (నాచురలైజేషన్‍). గ్రీన్‍ కార్డు కలిగినవారు, కుటుంబ వలస, దత్తత, శరణార్థిగా గుర్తింపు ఉన్నవారు మామూలుగా అమెరికన్‍ పౌరసత్వం పొందడానికి అర్హులు.

తాత్కాలికంగా పని మీద అమెరికా రావాలనుకునేవారికి కొన్ని వీసాలను తాత్కాలికంగా అమెరికా ఇస్తోంది. హెచ్‍ 1 బి, హెచ్‍ 2బి, ‘జె’, ‘ఎల్‍’ వీసాలు తాత్కాలిక వీసాల కిందకు వస్తాయి. అమెరికా ఆర్థిక, విద్యా, సాంస్కృతిక రంగాల్లో స్వల్పకాలం పనిచేయడానికి వచ్చేవారికి ఈ తాత్కాలిక వీసాలు లభిస్తాయి. ప్రస్తుతం కొన్ని మినహాయింపులతో డొనాల్డ్ ట్రంప్‍ ప్రభుత్వం తాత్కాలిక వీసాలనే నిషేధించింది.

వీసాలపై నిషేధం విధించాలన్న ఆలోచన ట్రంప్‍కు ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే తొలుత కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల నుంచి అమెరికాకు ఎవరూ రాకూడదంటూ ప్రయాణాలపై నిషేధం విధించారు. తరువాత ఈ ఏడాది హెచ్‍ 1బి, ‘ఎల్‍’ తరగతుల వీసాదారులను నియమించుకునే పరిశ్రమలు, కంపెనీల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్‍లు ఉద్యోగాలను కోల్పోయారు. దాదాపు 1.7 కోట్లమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయినవారికి సహజంగానే ప్రభుత్వంపై ఆగ్రహం కలగడం సహజం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు గడువు దగ్గర వచ్చింది. ఈ సమయంలో వారిని ఆకట్టుకోవాలనుకుంటే వీసా బ్యాన్‍ ఒక్కటే తాత్కాలిక పరిష్కారమని ట్రంప్‍ వీసా బ్యాన్‍ను పొడిగిస్తూ ఎగ్జిక్యూటివ్‍ ఆర్డర్‍లు జారీ చేశారు. ఇదే సమయంలో కొన్ని మినహాయింపులను కూడా ఆయన ఇచ్చారు. ఎందుకంటే కోవిడ్‍ 19తో అమెరికా చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో అనుభవం ఉన్న నిపుణులు లేకపోతే గండం గట్టెక్కడం కష్టమని భావించి ఈ మినహాయింపులను ట్రంప్‍ ఇచ్చారు. ఆహార సరఫరా గొలుసులో హెచ్‍ 2బి వీసాతో పనిచేస్తున్నవారికి ట్రంప్‍ నిషేధాజ్ఞల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే రక్షణ రంగం, శాంతిభద్రతల నిర్వహణ, దౌత్యం, కొవిడ్‍ చికిత్సలో నిమగ్నమైన ఆరోగ్య కార్యకర్తలు, అమెరికా ఆర్థికంగా త్వరితగతిన కోలుకోవడానికి కీలకమైన పనుల్లో ఉన్నవారు జాతీయ భద్రత కోణంలో మినహాయింపు పొందుతారు. ఇలాంటివారిలో హెచ్‍ 1బి, ‘ఎల్‍’ వీసాదారులు ఉంటారు.

ట్రంప్‍ విధించిన వీసా బ్యాన్‍పై ఇమ్మిగ్రేషన్‍ నిపుణులు ఏమంటున్నారంటే...

అమెరికాలో ఉంటున్న భారతీయ సంతతికి చెందిన ఇమ్మిగ్రేషన్‍ నిపుణులు ట్రంప్‍ వీసా ఎగ్జిక్యూటివ్‍ ఆర్డర్‍పై తమ స్పందనలను వెలిబుచ్చారు. కల్పన పెద్దిభొట్ల, జనేత ఆర్‍ కంచర్ల, భానుబాబు ఇలింద్రా, నవనీత్‍ చుగ్‍ తదితరులు దీనిపై తమ స్పందనను తెలియజేశారు. వారి స్పందనను తెలుగు టైమ్స్ తమ పాఠకులకోసం ఇక్కడ ప్రచురిస్తోంది.

కల్పన వి. పెద్దిభొట్ల, కాలిఫోర్నియా

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ వీసాలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలో నిరుద్యోగం ఏమాత్రం తగ్గదని, ఇది కేవలం ట్రంప్‍ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పని మాత్రమే అని వివరించారు.  ప్రతి రంగంలోను అమెరికా లో లభించని టాలెంట్‍ ని మాత్రమే బయట నుంచి తీసుకు వచ్చేందుకే వీసాలను ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని ఆమె పేర్కొంటూ, ఇలాంటి చర్యలు అధ్యక్ష ఎన్నికల సమయంలో రావడం రాజకీయ ప్రయోజనాలకోసమే తీసుకున్న చర్యగా గుర్తించవచ్చని చెప్పారు.   ఈ నిలిపివేత ఎక్కువగా అమెరికా నుంచి వీసా స్టాంపింగ్‍ కోసం బయటకు వెళ్లిన వారికి, 24 జూన్‍ తరువాత వీసా కు వెళ్లి అమెరికా వద్దామనుకొనే వారికి వర్తిస్తుందని, ఇక్కడ వున్న ఉద్యోగులకు ఎలాంటి భయము లేదని చెప్పారు. అలాగే అమెరికా లోని అనేక కంపెనీలు తమ అభివ•ద్ధి పధకాల కోసం ఇప్పటికే పెద్ద మొత్తం లో డబ్బు ఖర్చు పెట్టారని, ఆ కంపెనీలు బాగా నష్ట పోతాయని వివరించారు.

నవనీత్‍ చుగ్‍, న్యూజెర్సి

న్యూజెర్సిలో ఉంటున్న అటార్నీ నవనీత్‍ ఛుగ్‍ ట్రంప్‍ ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్‍ ఆర్డర్‍ పై స్పందిస్తూ, ఇప్పటికే నాలుగు నెలలుగా అన్ని దేశాలలోను కాన్సులేట్‍ ఆఫీసులు మూసివుండటం వలన, విమానాల రాకపోకలు ఆగిపోవటం వలన అనేక మంది ఉద్యోగులు రాలేక పోయారని, ఈ ఆర్డర్‍ వలన రావలసిన ఉద్యోగులు ఈ సంవత్సరంలో రాలేరు అని, అందువలన అనేక కంపెనీలు చాల నష్టపోతాయని తెలిపారు. కాకపోతే ఇక్కడ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

జనేతా ఆర్‍ కంచర్ల. వర్జీనియా

ఇమ్మిగ్రేషన్‍ విషయాలపై ఎప్పటికప్పుడు స్పందించే అటార్నీ జనేతా ఆర్‍ కంచర్ల తాజాగా ట్రంప్‍ తీసుకున్న నిర్ణయంపై కూడా స్పందించారు. కోవిడ్‍ 19 సంక్షోభం నుంచి తేరుకోవడంతోపాటు, అమెరికాలో ఉంటున్నవారికి ప్రయోజనం కల్పించేందుకు వీలుగా వీసాలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్‍ చెప్పడం ఎదురుచూసిందే. కాకపోతే దీనివల్ల ఇక్కడ ఉన్నవారికి, అలాగే వీసాలపై స్టాంప్‍ పడినవాళ్ళకు పెద్దగా ఇబ్బందేమి ఉండదు. కొత్తగా వచ్చేవారికి, వీసాకోసం అప్లయ్‍చేసుకున్నవారికి మాత్రం ఈ ఉత్తర్వుల వల్ల ఇబ్బంది ఉంటుంది. కాగా ట్రంప్‍ నిర్ణయం చాలామందికి పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదని, ఎప్పటి నుంచే ఆయన చెబుతున్నదేనని జనేతా ఆర్‍ కంచర్ల చెప్పారు.

భానుబాబు ఇలింద్రా

ఇది ఊహించిందే.. ఇది తాత్కాలికమైన నిషేధం విధించారు కాబట్టి ప్రస్తుతానికి ఇండియానుంచి వచ్చేవాళ్ళకి కొంత ఇబ్బందిని ఇది కలిగిస్తుంది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలోనే దీనిని ట్రంప్‍ విధించారని అందరూ భావిస్తున్నారు. దీనివల్ల ఇక్కడే ఉన్నవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగవు.

జయ్‍ తాళ్ళూరి, అధ్యక్షుడు, తానా

అమెరికాలో ఇప్పటికే ఉంటున్నవారిపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. కొత్తగా అమెరికా రావాలనుకున్నవారిపైనే ఇది వర్తిస్తుందని, వారు ఇప్పుడు అమెరికా రావడం కష్టమేనని చెప్పారు. ఓపిటీ లేదా స్టూడెంట్‍ వీసాపై వచ్చినవారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తెలుగువారిపై ప్రభావం ఉన్నా, భయపడాల్సిన పని లేదన్నారు.

పరమేష్‍ భీమ్‍రెడ్డి

అమెరికాలో ఉంటున్న తెలుగువారికి, ఇండియా నుంచి అమెరికా రావాలనుకుంటున్న వాళ్ళకు ట్రంప్‍ విధించిన వీసా బ్యాన్‍పై అవగాహన కల్పించడానికి మేము మా అటార్నీ చుగ్‍ ద్వారా ప్రయత్నించాము. దీనిపై సభ్యులకు కలిగిన సందేహాలపై న్యూస్‍లెటర్‍ను ప్రత్యేకంగా పంపించడం జరిగింది.

మురళి తాళ్ళూరి

వీసాపై వచ్చే వార్తలు, కథనాలపై ఎంతోమంది ఇండియన్స్ దృష్టి పెట్టుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది అమెరికా రావాలని అప్లయ్‍ చేస్తుంటారు. వీరిలో కొంతమందికి మాత్రమే వీసాలు దొరుకుతుంటాయి. వీసాకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అందరూ ఇష్టపడుతుంటారు కాబట్టి ప్రస్తుతం ట్రంప్‍ వీసాపై విధించిన నిషేధానికి సంబంధించి సమాచారాన్ని అందరికీ తెలపాలన్న ఉద్దేశ్యంతో ఇటీవల అటార్నీతో లైవ్‍ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం జరిగింది.