https://www.google.com/amp/s/telugu.ram-gopal-varma-strategy-to-ss-rajamouli-about-rrr-release

ఆయ‌న ఒంట‌రిగానే కాదు చాలా తుంట‌రిగానూ ఉంటారు. ఆయ‌న ప‌ని ఆయ‌న చేసుకుంటూనే...త‌మ ప‌ని తాము చేసుకుపోయేవాళ్ల‌నూ వ‌దిలిపెట్ట‌రు.కాంట్రావ‌ర్సీ కింగ్ రామ్‌గోపాల్ వ‌ర్మ గురించే ఈ ఉపోథ్ఘాతం. క‌రోనాని కూడా వ‌దిలిపెట్ట‌కుండా ర‌ఫ్‌ ఆడేసుకుంటున్న ఈ ద‌ర్శ‌కుడు...ఇటీవ‌ల ఓటిటీ,ఏటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లో సినిమాలను వ‌రుస‌గా విడుద‌ల చేస్తూ సంద‌డి చేస్తున్నారు. బిగ్‌స్క్రీన్ కోసం సినిమాలు చేస్తున్న‌ప్పుడు ఏ ర‌కంగా అయితే ఇత‌ర సినీ ప్ర‌ముఖుల‌పై తోచిన‌ట్టు కామెంట్స్ చేసేవారో... ఓటీటీ గురించి చేస్తున్న‌ప్పుడూ అదే విధంగా మొద‌లుపెట్టారు.

ఆన్‌లైన్ వేదిక‌ల‌పై సినిమాల విడుద‌ల ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్న రామూ... తాను ప‌ట్టిన‌ట్టే లాభాల బాట ప‌ట్ట‌మంటూ మ‌రికొంద‌రికి ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నారు. తొలిగా ఈ స‌ల‌హాను ఆయ‌న టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి ఇచ్చారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీయార్‌ల‌తో అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా రాజ‌మౌళి రూపొందిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాను బిగ్ స్క్రీన్ మీద కాకుండా ఓటీటీ మీద విడుద‌ల చేయ‌మ‌ని సూచించారు. తద్వారా ధియేట‌ర్ల‌లో విడుద‌ల చేసిన దానికన్నా చాలా చాలా ఎక్కువ మొత్తం ఆదాయం పొంద‌వ‌చ్చున‌ని వ‌ర్మ చెప్పారు. ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఉన్న అంచ‌నాల‌ను బ‌ట్టి చూస్తే...అత్య‌ధిక ధ‌ర చెల్లించి ఓటీటీ సంస్థ‌లు దీన్ని కొన‌డం ఖాయ‌మ‌ని, దానికి తోడుగా సినిమాను ఓటిటీలో విడుద‌ల చేసిన త‌ర్వాత మొత్తం 2 గంట‌ల్లోనే ఆదాయాన్ని వేయి కోట్లు వ‌ర‌కూ రాబ‌ట్ట‌వ‌చ్చున‌న్నారు. ఇప్ప‌టికే క్లైమాక్స్, న‌గ్నం వంటి లో నాసిర‌కం సినిమాల‌ను లో బ‌డ్జెట్‌లో తీసేసి కొత్త ప‌ద్ధ‌తిలో కోట్లు కొల్ల‌గొడుతున్నాడ‌ని సినీ ట్రేడ్ పండితులు వ‌ర్మ గురించి కామెంట్ చేస్తున్న నేప‌ధ్యంలో... అదే ప‌ని చేయాలంటూ రాజ‌మౌళిని వ‌ర్మ పురికొల్పుతుండ‌డం విశేషం. దీనిపై రాజమౌళి ఏవైనా స్పందిస్తారేమో చూడాలి.