Puri Jagannadh To Direct Salman Khan

ఒక‌ప్పుడు తెలుగు డైరెక్ట‌ర్స్ హిందీ సినిమాలు చేసి మంచి స‌క్సెస్‌లు అందుకున్నారు. గ‌త 20 సంవ‌త్స‌రాలుగా చూసుకుంటే వారి సంఖ్య బాగా త‌గ్గింది. టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్‌లో డైరెక్ట‌ర్‌గా స‌త్తా చాటిన వారిలో రామ్‌గోపాల్‌వ‌ర్మ ఒక్క‌డు క‌నిపిస్తున్నాడు. ఆ త‌ర్వాత తెలుగులో సూప‌ర్‌హిట్ అయిన సినిమాల క‌థ‌ల‌తో బాలీవుడ్‌లో చాలా సినిమాలు వ‌చ్చాయి, ఘ‌న‌విజ‌యం సాధించాయి. కానీ, ఆ సినిమాల‌ను తెలుగు డైరెక్ట‌ర్స్‌తో కాకుండా బాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌తోనే చేశారు. ఆమ‌ధ్య అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పూరి జ‌గ‌న్నాథ్ చేసిన సినిమా `బుడ్డా హోగా తేరా బాప్‌`. ఇప్ప‌డు మ‌రోసారి హిందీ సినిమా చేసేందుకు బాలీవుడ్ వెళ్తున్నాడు పూరి.

ఈసారి స‌ల్మాన్‌ఖాన్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో స‌ల్మాన్ కోసం పూరి ఒక అద్భుత‌మైన క‌థ‌ను రెడీ చేశాడ‌ట‌. ఈ క‌థ‌ను ఫోన్‌లోనే స‌ల్మాన్‌కు వినిపించ‌డం, అత‌ను కూడా క‌థ విని వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగిపోయింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స‌ల్మాన్ చేస్తున్న సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత పూరి ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. మ‌హేష్‌తో పూరి జ‌గ‌న్నాథ్ చేసిన `పోకిరి` తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. దీన్ని హిందీలో `వాంటెడ్‌` పేరుతో స‌ల్మాన్‌ఖాన్ హీరోగా రీమేక్ అయింది. బాలీవుడ్‌లో ఈ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాకు ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక తెలుగులో పూరి ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా `ఫైట‌ర్‌`. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స‌గానికిపైగా పూర్త‌యింది. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుందో తెలీదు. అలాగే స‌ల్మాన్ ఖాన్ చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో కూడా తెలీదు. దీన్నిబ‌ట్టి చూస్తే స‌ల్మాన్‌, పూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమా ఇప్ప‌ట్లో స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు లేవు.